Monday, April 29, 2024

వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారా.. జరా జాగ్రత్త ! సరికొత్త టెక్నాలజీతో ఉద్యోగుల‌పై నిఘా

అమరావతి, ఆంధ్రప్రభ : కరోనా అనంతరం ఇప్పటికీ వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. రిమోట్‌ వర్క్‌ చేస్తున్న ఉద్యోగులపై కీస్ట్రోక్‌ మానిటరింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిఘా పెట్టిన పలు ఐటీ సంస్ధలు, పని పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనికి సంబంధించి తాజాగానివేదిక ఒకటి సంచలనంగా మారింది. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ నివేదిక ప్రకారం ఎంప్లాయిస్‌ మానిటరింగ్‌ టూల్స్‌తోపాటు వెబ్‌ క్యాం ద్వారా పలు కంపెనీలు ఉద్యోగి కదలికలను పర్యవేక్షిస్తున్నాయి.

పలు దిగ్గజ కంపెనీలు సహా ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ఆఫీసు విధానానికి జై కొడుతున్నాయి. ఆఫీసులకు తిరిగి రావాల్సిందిగా అల్టిమేటం కూడా జారీ చేస్తున్నాయి. అయినా కొంత మంది ఉద్యోగులు, నిపుణులు మాత్రం ఇప్పటికీ ఇంటి నుండే పనిచేస్తున్నారు. ఇలాంటి వారిపైనే సంస్థలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ల ద్వారా నిఘా పెడుతున్నట్లు తాజా నివేదికలు ద్వారా తెలుస్తోంది.

- Advertisement -

ఎంప్లాయిస్‌ మానిటరింగ్‌ టూల్స్‌తో నిఘా

సాఫ్ట్‌వేర్‌ కీస్ట్రోక్‌లు, మౌస్‌ కదలికలతో సహా వివిధ రకాల కదలికలను కూడా ఆ సాఫ్ట్‌వేర్‌ కనిపెడుతుందని చెబుతున్నారు. దీని ద్వారా రిమోట్‌ కార్మికులపై కన్ను వేసి ఉంచుతున్న కంపెనీలు, తేడా వస్తే మాత్రం తీసేయడానికి వెనుకాడటం లేదు. ఎంప్లాయిస్‌ మానిటరింగ్‌ టూల్స్‌ ద్వారా వారిని ట్రాక్‌ చేస్తున్న కంపెనీలు పని వేళల్లో వారు కంప్యూటర్‌కు దూరంగా ఉన్నట్లు వెల్లడైతే మాత్రం ఆయా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.

ఈక్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళా ఉద్యోగి దొరికిపోయింది. ఆమె ల్యాప్‌ టాప్‌లో కీస్ట్రోక్‌ యాక్టివిటీ తక్కువగా ఉందని గుర్తించింది. మూడు నెలల పాటు తన ల్యాప్‌టాప్‌పై సరైన యాక్టివిటీ చేపట్టలేదని గుర్తించిన కంపెనీ ఆమెను కన్సల్టెంట్‌ ఉద్యోగం నుండి తొలగించింది. గంటకు 500 కీస్ట్రోక్‌లు అవసరమని, అయితే ఆమె సగటున 100 కంటే తక్కువగా ఉందని కంపెనీ తెలిపింది.

మౌస్‌ మూవింగ్‌ టెక్నాలజీ

మరోవైపు మౌస్‌ మువింగ్‌ టెక్నాలజీతో వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న కిలాడీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఒక ప్రముఖ కంపెనీ ఇద్దరు ఉద్యోగులను తొలగించినట్లు గుర్తించారు. ఇందుకోసం టైమ్‌ డాక్టర్‌ అనే రియల్‌ టైం డాష్‌ బోర్డులు, ప్రోగ్రెస్‌ రిపోర్టులను అందించే సాఫ్ట్‌వేర్‌ను వాడినట్లు తెలిసింది. ఇది ఉద్యోగులను స్క్రీన్‌ రికార్డు చేసి, లాగ్‌ఒలను తనిఖీచేసినట్లు సదరు కంపెనీ యాజమాన్యం ట్విట్టర్‌లోపేర్కొంది.

ఉద్యోగుల గోప్యతపై ఆందోళన

చాలా కంపెనీలు ఇలాంటి నిఘానే పెడుతున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు కొన్ని కంపెనీలు మౌస్‌ క్లిక్‌లను ట్రాక్‌ చేస్తాయి లేదా కార్మికులు తమ కంప్యూటర్‌ వద్ద ఉన్నారని నిర్ధారించుకునేందుకు వెబ్‌ క్యామ్‌ ఫోటోలను ఉపయోగిస్తాయి. ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఇటీవలి నివేదిక ప్రకారం 10 అతిపెద్ద అమెరికా ప్రైవేట్‌ కంపెనీలలో ఎనిమిది తమ ఉద్యోగుల ఉత్పాదకతను ట్రాక్‌ చేస్తున్నాయి ఈ ధోరణి ఉద్యోగి గోప్యత, నిఘా గురించి ఆందోళనలను పెంచుతోంది. కొంత మంది విమర్శకులు ఈ పద్దతులు హానికరమని, కార్మికులలో ఒత్తిడి మరియు ఆందోళనకు దారితీస్తుందని వాదించారు. అయితే దీనికి విరుద్ధంగా మరికొంతమంది మాత్రం ఉద్యోగులపై పర్యవేక్షణ నిర్వాహకులకు విలువైన సాధనంగా ఉంటుందని వాదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement