Monday, April 29, 2024

ఎలన్‌ మస్క్‌.. ఆలోచించుకో..! ఇదే ఆఖరి ఛాన్స్.. స్థానికంగా ఏర్పాటు చేస్తేనే రాయితీలు

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అడుగుపెట్టేందుకు నిర్ణయించడం శుభపరిణామమే అయినా.. ఆ కంపెనీ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే టెస్లా విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. తాజాగా రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ టెస్లాకు ఆఖరి ఛాన్స్‌ ఇచ్చారు. భారత్‌లో తయారీ యూనిట్‌లు పెడితే.. రాయితీలు, ప్రోత్సాహకాలు గురించి ఆలోచిస్తామన్నారు. భారత్‌లో యూనిట్‌ పెట్టి.. చైనాతో కార్లు తయారు చేయిస్తాం అంటూ అస్సలు వినేది లేదన్నారు. చైనాలో తయారు చేసి.. భారత్‌లో అమ్ముతామంటే కూడా కుదరదని తేల్చి చెప్పారు. అసలు టెస్లా తీసుకొచ్చిన ప్రతిపాదన అస్సలు నచ్చడమే లేదన్నారు.

కొత్త రాయితీల్లేవు..

వాహన రంగ కంపెనీలకు భారత్‌ మంచి మార్కెట్‌ అందిస్తోందని, బీఎండబ్ల్యూ, వోలో, ఫోక్స్‌ వ్యాగన్‌, హ్యుందాయ్‌, హోండా, రెనాల్ట్‌ లాంటి ఎన్నో కంపెనీలు ఇక్కడ ఉన్నాయని గుర్తు చేశారు. ఆ కంపెనీలకు ఎలాంటి రాయితీలు ఇస్తున్నామో.. టెస్లాకు కూడా అదే ఇస్తామని తేల్చి చెప్పారు. టెస్లాకు ప్రత్యేక రాయితీలు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు. టెస్లాకు కొత్త రాయితీలు ఇస్తే.. పాత కంపెనీలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. చైనాలో ప్లాంట్లు పెట్టి.. అక్కడి వారికి ఉద్యోగాలు ఇచ్చి.. ఇండియాలో కార్లు అమ్ముకుని లాభాలు పొందుతామనడం ఆశ్చర్యం వేస్తోందన్నారు. భారత్‌లో టెస్లా కార్లు అమ్ముకునేందుకు.. బెంగళూరులో కంపెనీ ఆఫీస్‌ రిజిస్టర్‌ చేసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనం కావడంతో ప్రత్యేక రాయితీలు ఇవాలని టెస్లా డిమాండ్‌ చేస్తున్నది. భారత్‌లోనే ఉత్పత్తి చేస్తే రాయితీలని, దిగుమతి చేస్తామంటే అదే స్థాయిలో పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందని భారత్‌ హెచ్చరిస్తున్నది. ఇవన్నీ చెప్పుకోని ఎలన్‌ మస్క్‌.. ప్రభుత్వం సహకరించడం లేదంటూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement