Thursday, May 2, 2024

విద్యారంగానికి పునర్వైభవం తీసుకురావాలి.. హరిద్వార్ పర్యటనలో ఉపరాష్ట్రపతి ఆకాంక్ష

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రపంచానికి విశ్వగురువుగా మార్గదర్శనం చేసిన వైభవోపేతమైన ప్రాచీన భారత విద్యావిధానాలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మన విద్యావిధానానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రాచీన విద్యావిధానాలు, ప్రస్తుత పరిస్థితుల మధ్య సమన్వయం జరగాలని సూచించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో సౌత్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్‌ను ఉపరాష్ట్రపతి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శతాబ్దాలపాటు విదేశీ పాలకులు భారతదేశ విద్యావిధానాన్ని నష్టపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. సుదీర్ఘకాలంపాటు సాగిన విదేశీ పాలన కారణంగా సమాజంలోని వెనుకబడిన వర్గాలు, మహిళలు విద్యాఫలాలను పొందలేకపోయారని వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం సమగ్రం, ప్రజాస్వామికం దిశగా వేసిన ముందడుగన్నారు.

శాంతి, సామరస్య పూర్వక వాతావరణం యావత్ ప్రపంచానికి అత్యంత అవసరమని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని’గా భారత్ విశ్వమానవాళికి మార్గదర్శనం కూడా చేస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గాయత్రి తీర్థ వ్యవస్థాపనకు స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సౌత్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్ వ్యవస్థాపనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధుడు, అశోకుడిని ఉపరాష్ట్రపతి స్మరించుకున్నారు. యుద్ధ ఘోష నుంచి ధర్మ ఘోష, పంచశీల సిద్ధాంతాలవైపు అశోకుడి ఆలోచన మారిన కారణాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి, ఆసియాలోని ప్రప్రథమ సెంటర్ ఫర్ బాల్టిక్ కల్చర్, స్టడీస్‌ను సందర్శించారు. ప్రయాగేశ్ మహాకాళ్ మందిరాన్ని సందర్శించి మందిర ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయ కులపతి డాక్టర్ ప్రణవ్ పాండ్యా, ఉపకులపతి డాక్టర్ చిన్మయ్ పాండ్యా, ప్రొ-వైస్ ఛాన్సిలర్, బోధనా సిబ్బంది, విద్యార్థులు, ఉత్తరాఖండ్‌లోని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement