Thursday, September 21, 2023

ఆరు గ్యారంటీలపై ఇంటింటికి ప్రచారం.. కార్యాచరణ సిద్ధం చేస్తున్న పీసీసీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విజయభేరి సభా వేదికగా మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌ సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అసెంబ్లి ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలతో మరింత ముందుకు దూసుకెళ్లుతోంది. ఈ నెల 17న సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించిన వెంటనే.. మరుసటి రోజు రాష్ట్రంలోని 119 అసెంబ్లి నియోజక వర్గాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్లు ఇన్‌చార్జ్‌లుగా వెళ్లి గ్యారంటీలను ఆవిష్కరించి.. కొంత మందికి అందజేశారు.

నియోజక వర్గాల్లోని ప్రతి ఇంటికి స్థానిక నాయకత్వం పంపిణి చేయనుంది. ఇప్పటికే రైతు, యువ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌, చేయూత పథకం కింద రూ. 4 వేల పెన్షన్‌ ప్రకటించిన కాంగ్రెస్‌.. తాజాగా ప్రకటించిన ఆరు గ్యారంటీలపై పల్లెల్లో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజలకు తెలిసే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన చేస్తోంది. పార్టీ నాయకులు పాల్గొని ప్రజలకు వివరించే విధంగా సన్నద్ధమవుతోంది.

- Advertisement -
   

కర్ణాటకలో అయితు హామీల గ్యారంటీ కార్డు ప్రకటించడంతో.. అక్కడి ఎన్నికల్లో ఆ హామీలు తీవ్ర ప్రభావం చూపినందున అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలోనూ ఆరు గ్యారంటీలతో పాటు వివిధ రకాల డిక్లరేషన్లతో అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక బద్దంగా వెళ్లి.. ఓటర్లను ఆకర్శించే విధంగా పార్టీ కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి నెల రూ. 25,00, ఆర్టీస బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌ లాంటీ హామీలను మహిళా ఓటర్లను ప్రభావితం చేస్తాయని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తోంది. యువ వికాంస పేరుతో విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు, ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలల ఏర్పాటు పథకాలు యువతపై ప్రభుత్వం చూపుతాయని పీసీసీ భావిస్తోంది.

ఇక రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ. 15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయంపై ఆధారపడి జీవినం సాగించే రైతు కూలీలకు ప్రతి ఏటా రూ. 12 వేలు, వరి పంట పండించే రైతులకు మద్ధతు ధరకు అదనంగా మరో రూ. 500 బోనస్‌ కింద చెల్లిస్తారు. ఇవి వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే రైతులను, రైతుపై ఆదారపడి జీవనం సాగించే కూలీలను కాంగ్రెస్‌ వైపు మళ్లించేందుకు దోహదం చేస్తాయని పీసీసీ అంచనా వేస్తోంది.

పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించే వారికి.. ఉచితమని ప్రకటనతో.. ఆ కేటగిరికి వచ్చే కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారుతారని భావిస్తున్నారు. ఇక చేయూత పేరుతో వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలతో పాటు అర్హులైన వారికి నెలకు రూ. 4 వేల పెన్షన్‌, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ బీమా కంద రూ. 10 లక్షల వరకు ప్రయాెెజనం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ. 5 లక్షల ఆర్థిక సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి జాగా ఇస్తామన్న హామీలు ఆకర్శించే విధంగా ఉన్నాయని హస్తం పార్టీ నాయకులు చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో, రద్దీ కూడల్లో విస్తృత ప్రచారం..

అసెంబ్లి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 17 పార్లమెంట్‌ నియోజక వర్గాలకు కాంగ్రెస్‌ అధిష్టానం నియమించిన పరిశీలకుల ద్వారా ఈ ఆరు హామీల గ్యారంటీ కార్డును జనంలోకి తీసుకెళ్లేందుకు కసరత్తులు చేస్తోంది. కరపత్రాలు, గోడ పత్రాలు, ఫ్లెక్సీలు, గోడరాతలు, ఇలా వివిధ రకాలుగా వాటిని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. డీసీసీ అధ్యక్షులను, అసెంబ్లి నియోజక వర్గాల ఇంచార్జ్‌ బాధ్యత వహిస్తున్న ప్రధాన కార్యాదర్శులను, పార్లమెంట్‌ నియోజక వర్గాల వారీగా నియమితులైన ఏఐసీసీ పరిశీలకులను, పీసీసీ ఉపాధ్యక్షులను, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లను భాగస్వామ్యం చేసి నియోజక వర్గ స్థాయి నాయకుల ద్వారా, పోలింగ్‌ బూతుల వారీగా వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ఎక్కువ మంది జనం చూడగలిగే ప్రాంతాల్లో పెద్ద, పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, గోడలపై రాతలు రాయించడం, ఇంటి తలపులపై ఆరు గ్యారంటీలకు చెందిన పోస్టర్లు అంటించడం, పెద్ద సంఖ్యలో కరపత్రాలను రద్దీ ప్రదేశాల్లో పంపిణి చేయడం లాంటివి చెపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ విషయంపై పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితర కమిటీ సభ్యులు దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement