Tuesday, April 30, 2024

Big story | పెండింగ్‌లు ఉండొద్దు, పథకాలు ఆగొద్దు.. ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం కేసీఆర్‌

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ఎన్నికల వేడి మొదలైంది. ఎలక్షన్‌ పోరులో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హ్యాట్రిక్‌ దిశగా పథకాలు, పెండింగ్‌లు లేని హామీలతో దూసుకుపోతున్నది. ఈ దిశగా కార్యాచరణ మొదలు పెట్టింది. రాష్ట్రమంతటా అందరికీ నచ్చి, అన్ని వర్గాలనూ మెచ్చే పథకాలు, ప్రజాకర్శక విధానాలకు సాన బెడుతున్నది. బీసీలకు సరికొత్త పథకంతో రూ.లక్ష ఉచిత సాయంతో వారి మనసులను దోచేస్తోంది. ఇదే స్పీడ్‌తో అన్ని వర్గాలకూ చేరువయ్యేలా ముమ్మరం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో అసంపూర్తిగా ఆగిపోయిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పూర్తి దిశగా ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో సరికొత్త పథకాలు, పాత పథకాల గ్రౌండింగ్‌ దిశగా కార్యాచరణ పెంచింది.

ఎన్నికల ఏడాది కావడంతో పాలనలో వేగం పెంచే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షలు, అవసరాల దిశగా దృష్టి కేంద్రీకరించారు. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, ప్రజల డిమాండ్లను తెలుసుకుంటున్నారని సమాచారం. ఇందుకు ప్రజా ప్రతినిధులు మొదలుకొని అధికారులతో వివిధ రూపాల్లో సమాచార సేకరణ చేస్తున్న ఆయన త్వరలో పలు కీలక ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. రెండోసారి అధికారం చేపట్టి ఐదేళ్లకు చేరుతున్న నేపథ్యంలో కీలక సంస్కరణల దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ధరణి పోర్టల్‌పై మరింత మెరుగైన పద్ధతి, త్వరలో పోడు భూములకు పట్టాలు, సొంత ఇంటి జాగ ఉన్నవారికి రూ.3లక్షల ఆర్ధిక సాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ధాన్యం కొనుగోళ్లు, ముందస్తు సాగు, రైతుబంధు, పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ, కొత్త పింఛన్లు, ఇతర నూతన పథకాలపై కీక ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు.

- Advertisement -

ఇక రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆంక్షలను ఎండగట్టేలా దృష్టిసారించింది. ఆయా అంశాలపై శాఖల వారీగా వివరాలపై అధికారులతో చర్చించి సమగ్ర నివేదికను సిద్దం చేయనున్నారని సమాచారం. 14, 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులను కేంద్రం పట్టించుకోకపోవడంతో జరిగిన ఆర్ధిక నష్టంతోపాటు, గ్రాంట్లు, రాష్ట్ర హక్కుగా రావాల్సిన నిధుల చెల్లింపుల్లో జాప్యంపై కేంద్ర ప్రభుత్వంపై అధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. సెస్‌ల పేరుతో పన్నుల వాటాను 41శాతంనుంచి 29శాతానికి కుదించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ. 1350కోట్లు, 14వ ఆర్ధిక సంఘం సూచించిన స్థానిక సంస్థలకు రూ.315కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.502కోట్లు పన్నుల పరిహారం రూ.723కోట్లు పెండింగ్‌లో పెట్టడంపట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే భారం రెండింతలకు…

రైతు రుణమాఫీ, రైతుబంధులతోపాటు కొత్తగా సామాజిక పించన్ల పెంపుతో ఖజానాపై మరింత భారం పడింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన అనేక కార్యక్రమాలు, చర్యలతో గడచిన తొమ్మిదేళ్లుగా ఆర్ధిక సుస్థితరను కొనసాగించుకుంటూ ముందుకు సాగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా వ్యయాలు, వేతనాలతో సతమతమవుతూనే అంతే గొప్పగా ఆర్ధిక స్థిరత్వానికి ముందుచూపుతో కీలక చర్యలు తీసుకుంటున్నది. గతేడాదికంటే రూ.1500కోట్లు అదనంగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లపైనే భారం పెరిగినప్పటికీ పీఆర్సీ ప్రకటన వంటి అంశాల్లో జాప్యం చేయలేదు.

అంతేస్థాయిలో ఇతర వ్యయాలు కూడా భారీగా పెరగ్గా, రాబడిని అంతకంతకూ పెంచుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. బకాయిల వసూలుకు ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టింది. రానున్న ఎనిమిది మాసాలను నేర్పుగా ఆర్ధికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసే చర్యలపై సర్కార్‌ దృష్టిసారించిందని చెబుతున్నారు.

కేంద్రం వద్ద పెండింగ్‌లేమిటీ…?

జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీఎస్టీ పన్నుపై పున:సమీక్ష చేయాలని డిమాండ్‌ను కేంద్రం ఎప్పిటినుంచో పెండింగ్‌లో పెట్టింది. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని కూడా తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి చెబుతూ వస్తోంది. అదేవిధంగా వ్యవసాయరంగానికి ప్రతిబంధకాలుగా ఉన్న పలు అంశాలపై నియంత్రణలు, పన్నులను ఎత్తివేసి మినహాయింపులను తెలంగాణ కోరుతోంది. నీతి ఆయోగ్‌ సిఫార్సులను అమలు చేసి తెలంగాణకు ఆర్ధిక సాయం అందించాలని, కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర వాటా పెంచాలన్న డిమాండ్‌పై కేంద్రం ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదు. ఇక రుణాలపై ఉన్న ఆంక్షలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, ప్రధానంగా కార్పొరేషన్ల రుణాలకు ఉన్న ఆటంకాల తొలగింపుపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది.

దిక్కూ మొక్కూలేదు…

ఆర్ధిక సంఘం, ఆర్భీఐ, నీతి ఆయోగ్‌ వంటి సంస్థలు సిఫార్సులు చేసినా కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదల. సిఫార్సుల అమలులో నిర్లక్ష్యం వహించడం తెలంగాణకు నష్టంగా మారుతోంది. 15వ ఆర్ధిక సంఘం సూచించిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధులు అందించాలని, విభజన హామీలకు బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని తెలంగాణ ప్రధానంగా ప్రస్తావించింది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలకు రూ. 25వేల కోట్లు చెల్లించలేదని, కాళేశ్వరానికి ఆర్ధిక సాయం చేయలేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెలంగాణ సర్కార్‌ తీసికెళ్లింది.

వరంగల్‌ మెట్రో ప్రాజెక్టుకు ఆర్ధిక సాయం, 1992లో మ73 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఆరంభమైందని, ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో పంచాయతీలకు నిధులను అందించాలని తెలంగాణ పలు సందర్భాల్లో కోరింది. ట్రైబల్‌ యూనివర్సిటీకి నిధులు, మెట్రో సిటీ హైదరాబాద్‌కు కేటాయింపులు, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ కేటాయింపులపై కేంద్రం రూ. 25వేల కోట్ల భారీ కోతలు విధించిన నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే నిధుల్లో గండి పడనుంది. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిజియన్‌(ఐటీఐఆర్‌) పునరుద్దరణ వంటి అంశాలపై తెలంగాణ ఎదురు చూస్తోంది.

ప్రజా సంక్షేమంలో ప్రగతి పథం…

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలులో లేవు. అణగారిన, నిమ్న వర్గాలు, అన్ని నిరుపేద వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిధుల్లో వాటా పెంచుతూ సంక్షేమ పథకాలతో ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పాటునందిస్తోంది. సకల వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సరికొత్త పథకాలను అమలు చేస్తూ తొమ్మిదేళ్ల పాలనలో ఉత్తమ లక్ష్యాలను చేరుకున్నది. రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపుల శాతం మూడింతలకు పెరిగింది.

2014-15 తొలి ఏడాదిలో సంక్షేమరంగాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌లో రూ. 24,424కోట్లు కేటాయించగా, గతేడాది నాటికి రూ. 98,425 కోట్లకు చేరుకున్నది. 2015-16లో రూ. 42,510కోట్లు, 2016-17 ఏడాదిలో రూ. 47,949కోట్లు, 2017-18లో రూ. 50,204కోట్లు, 2018-19లో రూ. 56,887కోట్లు, 2019-20లో రూ. 57,910కోట్లు, 2020-21లో రూ. 70,078కోట్లు, 2021-22 ఏడాదిలో రూ. 98,425కోట్లను కేటాయించి తన ఔదార్యాన్ని చాటుకున్నది. ప్రతీ నియోజకవర్గానికి 1500మందికి దళితబంధుపై నిధుల సమీకరణ వేగం పెంచింది.

సొంత స్థలం ఉన్న పేదలకు సొంతింటికి రూ. 3లక్షల అందజేతకు కూడా కార్యాచరణ జరుగుతోంది. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో సహజంగానే మరికొన్ని కొత్త పథకాలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడున్న పథకాల ఖర్చు, సబ్సిడీలు, జీతాలు, పింఛన్లు, ఉద్యోగులకు ఇతర వరాలు, పాత పెన్షన్‌ విధానం వంటి పలు అంశాలపై ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది.

ఏ సంక్షేమం… ఎందరికి…

ఆసరా 44,82,682
కళ్యాణలక్ష్మి 12,69,843
గురుకులాల విద్యార్ధులు 9,47,200
కార్పొరేషన్ల ద్వారా 18,82,832
మహిళలకు పైష్టికాహారం 4,77,922
ఉచిత విద్యుత్‌(రజక, మంగళి) 1,07,352
దళితబంధు 38,323
కేసీఆర్‌ కిట్‌ 13,91,000

Advertisement

తాజా వార్తలు

Advertisement