Sunday, May 5, 2024

కలవర పెడుతున్న కళ్ళ కలక.. వాతావరణ మార్పులతో బ్యాక్టీరియా వ్యాప్తి

అమరావతి, ఆంధ్రప్రభ: కళ్ల కలక కలవరపెడుతోంది. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే చాలు టక్కున అంటేసుకుంటుంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, అకనాపల్లి, శ్రీకాకుళం, ఎన్నీఆర్‌, కృష్ణా, గుంటూరు తో పాటు పలు జిల్లాల్లో కళ్ళ కలకలకు విజృంభిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో కేసులు ఎక్కువయ్యాయి. సాధారణంగా వర్షాకాలం అంటేనే వ్యాధుల సీజన్‌. మలేరియా, డెంగ్యూ, ఫ్లూతో పాటు కండ్ల కలక కేసులు పెరుగుతుంటాయి. పాఠశాలల్లో చిన్నారుల నుంచి కళ్ళ కలక వ్యాప్తి ఎక్కువగా ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళలో విద్యార్థులు కళ్ళకలక భారిన పడుతున్నారు.

పెద్దా చిన్ని తేడా లేకుండా అందరూ కళ్ళ కలకల భారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో నేత్ర విభాగాలకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఐడ్రాప్స్‌ సులువుగా తగ్గిపోతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వై ద్యులు పేర్కొంటున్నారు. మెడికల్‌ షాపుల్లో కళ్ళ కలక మందులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

వాతావరణ మార్పులే కారణం

నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పాటు అల్పపీడనం ప్రభావంతో కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. బలమైన గాలులు తోడవ్వడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గాల్లో తేమశాతం పెరిగింది. ఈ మార్పుల కారణంగా వైరస్‌ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తోంది. కళ్ళ కలక చిన్న ఇన్‌ఫెక్షనే అయినప్పటికీ రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏ పని చేసుకోనీయకుండా ఇబ్బందిపెడుతోంది. గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వాతావరణంలో మురికి కాలుష్య కారకాలు పెరగడం వల్ల వ్యాప్తి చెందుతోంది.

ఇవీ లక్షణాలు

- Advertisement -

కంటిలో ఉండే తెల్లభాగం కనురెప్పల ఉపరితలం కంజుంక్టివా అనే సన్న పొరతో కప్పబడి ఉంటుంది. ఈ పొర ఎర్రబడటాన్నే కళ్ళ కలక అంటారు. దీన్నే పింక్‌ ఐ అని కూడా అంటారు. కండ్లు ఎర్రబారడం, నీళ్ళు కారడం, కంటి రెప్పలు ఉబ్బిపోతాయి. రాత్రి నిద్రపోయే సమయాల్లో అతుక్కుపోతాయి. పుసులు కడతాయి. ఇరిటేషన్‌, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మందులు వాడకపోయినప్పటికీ వారం రోజుల్లో తగ్గే అవకాశం ఉందని, కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్‌ డ్రాప్స్‌ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు ఇలా

కంటిని తరుచు నీటితో కడుక్కోవాలి. కండ్ల కలక వచ్చిన వారికి దూరంగా ఉండాలి. వాళ్ళు వాడిన వస్తువులు వాడరాదు. ఈ వ్యాధి వచ్చిన వారి టవల్స్‌, కర్చీఫ్‌లు ఇతరులు వాడకూడదు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు. కండ్ల కలక వచ్చిన వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఆకు కూరలు, క్యారెట్లు, సిట్రన్‌ ఫ్రూట్స్‌ ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్రాంతాల్లో తిరగకుండా ఉంటెె ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉండదు.

ఇది ప్రమాదం

సాధారణంగా కళ్ళ కలక వస్తే వారంలో తగ్గిపోతుంది. వైరస్‌తో కళ్ళ కలక వస్తే మూడు వారాలపాటు ఉంటుంది. నవజాత శిశువులు, నెలలోపు వయసు ఉన్న వారిలో వస్తే మాత్రం ప్రమాదంగా మారుతోంది. తెల్లనిపొర నుంచి కంటిగుడ్డు కార్నియాకు విస్తరిస్తే చూపు మందగిస్తోంది. కార్నియాకు ఇన్‌ఫెక్షన్‌ సోకి అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. రంధ్రాలు పడే అవకాశం కూడా ఉంటుందని ఇలాంటి పరిస్థితి వస్తే చూపుకోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కళ్ళ కలక వారంలో తగ్గనట్లైతే నేత్ర వైద్య నిపుణుల్ని సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడటం ద్వారా సర్వేంద్రీయాల్లో అతి ముఖ్యమైన నయనాలను కాపాడుకోవచ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement