Monday, May 6, 2024

సీజనల్‌ వ్యాధుల కట్టడికి జిల్లాల వారీగా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు, ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాల వారీగా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను, క్షేత్రస్థాయి ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. సీజనల్‌ వ్యాధుల కట్టడికి తీసుకోవాసిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఎక్కడికక్కడ వైద్య ,ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి డెంగీ, మలేరియా బాధితులకు సత్వరం వైద్యం అందించాలని ఈ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలను వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ఈ టాస్క్‌ ఫోర్స్‌ టీఎంలలో జిల్లా కలెక్టర్‌తోపాటు గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, ఐసీడీఎస్‌, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు.

విస్తృతంగా డ్రైడే కార్యక్రమాలు..
రాష్ట్ర వ్యాప్తంగా డ్రైడే కార్యక్రమాలు పకడ్బంధీగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యతను ఈ కమిటీలకు అప్పగించారు. డ్రైడే లో భాగంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడ చెత్త, చెదారం పేరుకుపోకుండా, మురికి కాలువలు శుభ్రంగా ఉండేలా, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పిచ్చి మొక్కలు పెరగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వేడి , తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని , ఫాస్ట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. డ్రై డే కార్యక్రమ అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లాల డీఎంఅండ్‌హెచ్‌వోలకు అప్పగించారు. గ్రామాల్లో పారిశుధ్యం విషయం నిర్లక్ష్యం చేసినా, ట్రాక్టర్ల నిర్వహణలో అశ్రద్ధ చూపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతోపాటు డీఎంఅండ్‌హెచ్‌వోలు తమ పరిధిలోని పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

క్షేత్రస్థాయిలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు…
సీజనల్‌ వ్యాధుల నివారణకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీఎంలను వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇంటింటా జ్వర సర్వే చేపడుతున్నాయి. పరిసరాల పరిశుభ్రతతోపాటు తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైపాయిడ్‌తో ఎవరై నా బాధపడుతుంటే… ఈ టీంలు రంగంలోకి చికిత్స అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఊరూరా వైద్య, ఆరోగ్య శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రతీ ఊర్లో అందరికి నిర్భంధ రక్త పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలతోపాటు పలు గ్రామాల్లో వైద్య, ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రాథమిక వేదికలుగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు.

పెరుగుతున్న సీజనల్‌ వ్యాధిగ్రస్థులు…
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తాగునీరు కలుషితమవుతుండడంతో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు విష జ్వరాలు, వాంతులు, వి రేచనాలతో వస్తున్న పేషషీంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఏరియా ఆసుపత్రులకు జ్వరం, డయేరియాతో బాధపడుతున్న ఔట్‌ పేషెంట్ల తాకిడీ పెరుగుతోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, డయేరియా వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement