Friday, April 26, 2024

శాసనసభ స‌మావేశాల‌కు ముందే చ‌ర్చ‌లు.. 10న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈనెలలో జరగనున్న శాసనసభా ప్రత్యేక సమావేశాల సందర్భంగా ప్రభుత్వం అంతకుముందే కీలక సమావేశాలకు సిద్దమవుతున్నది. తొలుత ఈ నెల 10న రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ నిర్వహించి ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రూ.3లక్షల ఆర్ధిక సాయంతో ఇంటి నిర్మాణ పథకం, దళితబంధు అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత కలెక్టర్లతో ప్రభుత్వం భేటీ కానున్నది. ఎన్నికల ఏడాది కావడంతో పాలనను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పౌరసేవల విస్తరణ, రాష్ట్రాభివృద్ధి లక్ష్యాల చేరికలో కలెక్టర్లను కీలకం చేయనుంది. తెలంగాణ పునర్‌నిర్మాణ క్రమంలో ఎంచుకున్న లక్ష్యాలను పూర్తిస్థాయికి చేరుకోవడంలో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేలా వారికి లక్ష్యాలను నిర్దేశించనుంది. పల్లెప్రగతి కార్యక్రమం పనులు క్రమంలో ప్రతినెలా విడుదల చేస్తున్న నిధులు, ప్రాధాన్యతా క్రమంలో వాటి వ్యయం, గ్రామ పంచాయితీల నుంచి ప్రతిపాదనలు తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

పల్లె, పట్టణ ప్రగతిపై దృష్టి…

పురపాలక సంఘాలు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాల పట్టిక గురించి వివరించనున్నారు. గ్రామాల అభివృద్ధికి ఇస్తున్న మాదిరిగానే క్రమం తప్పకుండా పట్టణాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు, ఏప్రిల్‌ నుంచి నెలానెలా క్రమం తప్పకుండా విడుదల చేసే నిధుల వ్యయానికి సంబంధించి తనకున్న అభిప్రాయాలను పంచుకోనున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడులకుగల అవకాశాలు, అభివృద్ధిలో స్థానిక వ్యాపార, వాణిజ్య సంస్థల భాగస్వామ్యం, సహజ వనరుల వినియోగం, తద్వారా సంపద సృష్టించుకుని ఆర్థిక వనరులు మెరుగుపరుచుకునే విధానంపై ముఖ్యమంత్రి తనదైనశైలిలో కలెక్టర్లకు వివరించనున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పట్టణీకరణ నేపథ్యంలో వచ్చే రెండు దశాబ్దాల నాటి అవసరాలు తీర్చేందుకు ఇప్పటి నుంచే నిర్దిష్టమైన శాశ్వత కార్యాచరణ ప్రణాళికలను అమలుచేసే అంశంపైనా ఆయన సమాలోచనలు జరపనున్నారు.

సంస్కరణలపై చర్చ…

పాలనాపరమైన విధానాల్లో మార్పులు, అధికార యంత్రాంగం అధికారాలు, బాధ్యతల పెంపుపై కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. కొత్త పంచాయితీరాజ్‌ చట్టం, కొత్త పురపాలక చట్టాలను నిర్దిష్టంగా అమలుచేసి పౌర సేవలు మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళికలను కూడా ఈ సందర్భంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ధరణి సమస్యల నివారణకు తీసుకున్న చర్యలు భూ సమస్యలు లేని రెవెన్యూ విధానం సాధించేందుకు లక్ష్యాలను కూడా వివరించనున్నారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే క్రమంలో జిల్లా పరిపాలనాధికారులుగా కలెక్టర్ల పాత్ర, ప్రాధాన్యతా రంగాల్లో నిధులు ఖర్చుచేసే క్రమంలో పర్యవేక్షణ, సాగునీటి ప్రాజెక్టులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, సంక్షేమ ఆశ్రమ పాఠశాలల నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చేయాలన్న అంశంపై కూడా సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో చర్చించనున్నారు.

సంక్షేమ పథకాల అమలు క్రమంలో ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు వందశాతం ఆన్‌లైన్‌ సేవలను అందించాలని, ఆ దిశగా ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని కలెక్టర్లకు వెల్లడించి మరింత మెరుగైన పౌర సేవలను విస్తరింపజేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. పురపాలక ప్రాంతాల్లో మరో 55 పౌర సేవలను ఆన్‌లైన్‌ విధానంలోనే అమలుచేస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం మొదలుకొని మీ-సేవ కేంద్రాలను పటిష్టంచేసే కార్యాచరణపైనా ముఖ్యమంత్రి చర్చించనున్నారు. పాలనా వ్యవస్థను మరింత పటిష్టంచేసి అన్ని రంగాలు సమాన స్థాయిలో అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా కలెక్టర్ల సదస్సు అనంతరం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సామాజిక వెనకబాటుతనాన్ని అధిగమించేందుకు బడ్జెట్‌లో ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు, ప్రత్యేక నిధుల కేటాయింపులపైనా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement