Sunday, April 28, 2024

ఢిల్లీ గరం గరం మండిపోతున్న దేశ రాజధాని నగరం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని తీవ్రమైన వడగాలుల్లో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉష్ణోగ్రతలు క్రికెట్ స్కోర్ మాదిరిగా హాఫ్ సెంచరీకి దగ్గరవుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో గరిష్టంగా 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటున పలు ప్రాంతాల్లో 48 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ముంగేష్‌పూర్ వద్ద 49.2 డిగ్రీలు నమోదవగా, నజఫ్‌గఢ్ వద్ద 49.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం ఢిల్లీలోనే కాదు, దేశమంతటా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమ, ఉత్తర, మధ్య భారతదేశంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. రాజస్థాన్‌లో ఏకంగా ‘రెడ్ అలర్ట్’ జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ కొనసాగుతోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా వద్ద ఆదివారం 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఝాన్సీ వద్ద 47.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఒరాయ్, హమీర్‌పూర్, వారణాశి, చుర్క్ తదితర ప్రాంతాల్లో 45 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉన్న రాజస్థాన్‌లో గంగానగర్, చురు, బికనీర్, అల్వార్ ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పశ్చిమదిశ గాలుల ప్రభావం మార్చి నుంచే ఉత్తరాదిని ప్రభావితం చేస్తూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ గాలులు గరిష్ట ఉష్ణోగ్రతలను మరింత పెంచగా, వర్షాలను మాత్రం తీసుకురాలేకపోయాయి. ఫలితంగా 7 దశాబ్దాల్లో ఎప్పుడూలేనంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన మాసంగా ఏప్రిల్ రికార్డులకెక్కింది. ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశంలో తీవ్రమైన వడగాలులు మరికొన్నాళ్లు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే హీట్‌వేవ్‌గా, సాధారణం కంటే 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైతే తీవ్రమైన వడగాలులుగా వాతావరణ శాఖ పేర్కొంటుంది. అలాగే 47 డిగ్రీలు దాటితే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement