Thursday, May 2, 2024

కేరళ నర్సులు మలయాళం మాట్లాడకూడదని ఢిల్లీ ఆస్పత్రి ఆదేశాలు

కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరులో కేరళ నర్సులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పోరాటంలో చాలామంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. అంకిత భావంతో సేవలందించే కేరళ నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో వారు వేల సంఖ్యలో సేవలందిస్తున్నారు. అటు విదేశాలు కూడా కరోనాపై పోరాటంలో కేరళ నర్సుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మలయాళంలో మాట్లాడొద్దంటూ కేరళకు చెందిన నర్సులకు ఢిల్లీ ఆస్పత్రి వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రిలో ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ ఢిల్లీలోని గోవింద్ బల్లబ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (GIPMER) ఆదేశాలు జారీ చేసింది.

ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులు, సహచర ఉద్యోగుల్లో ఎక్కువ మందికి మలయాళం అర్థంకాకపోవడంతో ఇబ్బంది ఏర్పడుతోందని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. దీనికి సంబందించి తమకు ఓ ఫిర్యాదు అందినట్లు జిప్‌మెర్ తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకుని అందరూ ఇంగ్లీష్ లేదా హిందీలో మాట్లాడాలని…లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆస్పత్రి ఇచ్చిన ఆదేశాలపై మలయాళీలు మండిపడుతున్నారు. మాతృ భాషలో మాట్లాడుకోవద్దంటూ ఆదేశాలివ్వడం గర్హనీయమని మండిపడుతున్నారు. నర్సులకు ఇలాంటి ఆదేశాలివ్వడం సరికాదని జీబీ పంత్ నర్సస్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలాధర్ రామచందాని పేర్కొన్నారు. సర్క్యులర్‌లో వాడిన పదజాలం అభ్యంతకరమంగా ఉందన్నారు. అటు జిప్‌మర్ ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం పట్ల కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిధరూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య భారతావనిలో మాతృభాషలో మాట్లాడొద్దని ఆదేశాలివ్వడమేంటని ప్రశ్నించారు. ఇది ప్రాధమిక హక్కుల ఉల్లంఘనగా అభ్యంతరం వ్యక్తంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement