Monday, April 29, 2024

Delhi | ఓటమి భయంతోనే దాడులు.. ఢిల్లీలో టీడీపీ ఎంపీ కనకమేడల విమర్శలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఓటమి భయంతోనే తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ దాడులకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పుంగనూరు ఘటనపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు బండ్లు, కార్లు తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా ఎందుకు పెట్టారో పోలీసులు సమాధానం చెప్పాలని అన్నారు. రౌడీలు రాజ్యమేలుతున్నారని చెప్పడానికి పుంగనూరు ఘటనే నిదర్శనమని అన్నారు.

చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటున్న పోలీసులు, ఏ అనుమతి తీసుకుని వైఎస్సార్పీ నేతలు అక్కడికి చేరుకున్నారో చెప్పాలని కనకమేడల డిమాండ్ చేశారు. పోలీసులు సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు నడచుకుంటున్నారని, వారు ఏది చెప్పమంటే అదే మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే, పోలీసులు వారికి దగ్గరుండి సహకరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటన చేస్తే లేని శాంతిభద్రతల సమస్యలు, ప్రతిపక్ష నేత పర్యటిస్తేనే ఎందుకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.

- Advertisement -

అప్పులు నిజమా కాదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు నిజమా కాదా అంటూ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. అప్పులపై తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించిన వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్లమెంటులో కేంద్ర మంత్రి స్వయంగా ఏపీ అప్పులపై ప్రకటన చేశారని, గతంలో కాగ్ సీరియస్ అయిన విషయం నిజమా కాదా చెప్పాలన్నారు. తాము లేవనెత్తిన అంశాలపై నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45 మీటర్ల నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ టెండర్ల పేరుతో నిర్మాణం మరింత జాప్యమయ్యేలా చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగానే కాఫర్ డ్యాం దెబ్బతిందని అన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామన్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కేంద్రం ముందు తానే స్వయంగా మెడలు వంచారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని, ఆ వెంటిలేటర్ కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement