Wednesday, May 15, 2024

కర్బన ఉద్గారాల నియంత్రణలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మరో అడుగు.. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తీసుకొచ్చిన జీఎంఆర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: 2030 నాటికి కర్బన ఉద్గార రహితంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మార్చాలన్న లక్ష్యంలో భాగంగా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నేతృత్వంలో కన్షార్షియం 57 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది. విమానాశ్రయంలో వినియోగించే వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలో తెచ్చిన మొట్టమొదటి విమానాశ్రయంగా రికార్డుల్లో చేరింది. 2022 జూన్‌లో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టినట్టు జీఎంఆర్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ చర్య ద్వారా ప్రతియేటా 1,000 టన్నుల గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాన్ని నియంత్రించగల్గుతామని వెల్లడించింది.

మొత్తం విమానాశ్రయంలో ఎయిర్‌సైడ్, ల్యాండ్ సైడ్ ఆపరేషన్స్ కోసం 64 ఎలక్ట్రిక్ వాహనాలకు ఆర్డర్ ఇవ్వగా, తొలి విడతలో 57 వాహనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. త్వరలో మిగతా 7 వాహనాలు కూడా అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేయడం కోసం 22 చార్జింగ్ పాయింట్లతో మొత్తం 12 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు జీఎంఆర్ గ్రూపు తెలిపింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) అందజేసే ఎయిర్‌పోర్ట్ కార్బన్ అక్రిడేషన్ ప్రోగ్రామ్ లో అత్యున్నత స్థాయి “ట్రాన్సిషన్-లెవెల్ 4 ప్లస్”కు చేరుకుందని జీఎంఆర్ గ్రూపు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement