Saturday, May 18, 2024

Delhi | ఖమ్మం జిల్లాలో దొంగ ఓట్లు తొలగించండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి తుమ్మల ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35 వేల దొంగ ఓట్లు నమోదయ్యాయని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఆ ఓట్లు తొలగించే వరకు ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌తో ఖమ్మం జిల్లా కలెక్టర్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్లు కుమ్మక్కై దొంగ ఓట్లు నమోదు చేశారని తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఈ ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని కూడా తుమ్మల డిమాండ్ చేశారు. ఇంటి నెంబర్లు లేకుండా ఓట్ల నమోదు జరిగిందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గాలవారిగా ఒక జాబితాను తన ఫిర్యాదు లేఖకు జతచేసిన తుమ్మల, వాటిని దొంగ ఓట్లుగా పేర్కొన్నారు.

- Advertisement -

ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌తో పాటు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా సరే పట్టించుకోలేదని తెలిపారు. ఈ ఫిర్యాదు కాపీలను కూడా తుమ్మల తన లేఖకు జతపరిచారు. ఓటర్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలని ఆయన ఈసీకి విజ్ఞప్తి చేశారు. దొంగ ఓట్లను తొలగించిన తర్వాతనే జాబితాను విడుదల చేయాలని కోరారు.

హాస్టళ్ల పేరుతో దొంగ ఓట్ల నమోదు

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో హాస్టల్ భవనాల్లో విద్యార్థుల పేర్లతో దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ హక్కుల కార్యకర్త కే. వెంకన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొత్తం 9,856 పేజీలలతో కూడిన ఓటర్ల జాబితాను పరీశిలించి, అందులో 458 పేజీల నివేదికను ఆయన రూపొందించారు. మొత్తం 5,376 దొంగ ఓట్ల ఉన్నాయని పేర్కొంటూ ఆయన సోమవారం ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన 11 భవనాల్లో 1,873 ఓట్లు నమోదయ్యాయని, ఒకే ఇంటి నెంబర్ ని మూడు, నాలుగు పోలింగ్ బూత్‌లో వేరు వేరుగా నమోదు చేశారని ఆరోపించారు. ఆ ఒక్క ఇంటి నెంబర్ లోనే మూడు, నాలుగు హాస్టల్స్ ఉన్నట్లుగా చూపుతూ విద్యార్థుల పేరిట ఓట్లు నమోదు చేశారని వెల్లడించారు. ఒకే బిల్డింగ్ లో బాయ్స్, గర్ల్స్, డెంటల్, నర్సింగ్ పీజీ హాస్టళ్లను సృష్టించారని తెలిపారు.

దొంగ ఓట్లపై పోరాడుతున్నందుకు తనపై 11 అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 18 మందిపై 136 కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని తెలిపారు. కలెక్టర్, ఎస్పీలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనను కిడ్నాప్ చేసి ఎన్‌కౌంటర్‌కు ప్రయత్నించారని తెలిపారు. రౌడీ షీట్, ఆయుధాల యాక్ట్, రేప్ కేసు లాంటి కేసులు తనపై నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement