Friday, May 17, 2024

Delhi | 13 నుంచి ఢిల్లీలో ఆడ్-ఈవెన్.. కాలుష్యం కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో గత కొద్ది రోజులుగా సగటున 500 కంటే ఎక్కువ నమోదవుతోంది. దీపావళి కంటే ముందే పరిస్థితి ఇలా ఉంటే, పండుగ తర్వాత కాలుష్యం మరింత పెరుగుతుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న కొన్ని నిషేధాజ్ఞలకు తోడు సరి-బేసి (ఆడ్-ఈవెన్) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

నవంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు ఈ విధానం అమలవుతుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఆ ప్రకారం సరి సంఖ్య కలిగిన వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య కల్గిన వాహనాలు మరో రోజు రోడ్లపైకి వచ్చేలా కట్టడి చేయనున్నారు. తద్వారా వాహనాల వినియోగం 40 శాతం వరకు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

- Advertisement -

అయితే ఢిల్లీలో వాయుకాలుష్యానికి స్థానిక పరిస్థితుల కంటే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాత తదుపరి పంటకు భూమిని సిద్ధం చేయడం కోసం రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం ప్రధాన కారణంగా మారుతోంది. దీనికి తోడు శీతాకాలంలో పొగమంచు దట్టంగా పరుచుకోవడం వల్ల కాలుష్య ఉద్గారాలు అక్కడే నిలిచిపోతున్నాయి.

కాలుష్యాన్ని కట్టడి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పంటవ్యర్థాలు కాల్చుతున్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి, ప్రత్యమ్నాయ మార్గాలను సూచించింది. ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేస్తున్న రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. హర్యానాలో కొంత వరకు ఇది ఫలితాలను ఇచ్చినప్పటికీ.. పంజాబ్‌లో మాత్రం ప్రభావం చూపలేదు. దాంతో ఈ సమస్య కొనసాగుతూనే ఉంది.

కాలుష్యం స్థాయులు పెరగడంతోనే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ వస్తోంది. తొలి దశలో కాలుష్యానికి ఎక్కువగా వెదజల్లే ట్రక్కులు, బీఎస్-3 పెట్రోల్ వాహనాలు, బీఎస్-4 డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. నగరంలో నిర్మాణ పనులపైనా నిషేధాన్ని ప్రకటించింది.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలని, మిగతా 50 శాతం సిబ్బందికి ఇంటి నుంచే పనిచేసే (వర్క్ ఫ్రమ్ హోం) విధానాన్ని అనుసరించాలని సూచించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించి, ఆన్‌లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఇలా ఎన్ని చర్యలు చేపట్టినా సరే.. ఢిల్లీ కాలుష్యం స్థాయులు ఏమాత్రం తగ్గకపోగా నానాటికీ పెరుగుతూ మరింత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement