Saturday, May 4, 2024

తిమ్మమ్మ మర్రిమానును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించండి.. వీరాంజనేయులు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న శ్రీ సత్యసాయి జిల్లా కుంట మండలంలోని తిమ్మమ్మ మర్రిమాను సహా కోటును, గంగరాజు బాల వీరయ్య స్వామి దేవాలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ పరిషత్ ఛైర్మన్ డా. జాస్తి వీరాంజనేయులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన వినతి పత్రాలను వారి వారి కార్యాలయాల్లో అందజేశారు. అనంతరం బుధవారం సాయంత్రం తిలక్ మార్గ్‌లో ఉన్న పురావస్తు శాఖ అదనపు డైరక్టర్ జనరల్ గుర్మీత్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన వీరాంజనేయులు.. తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర గురించి చెబుతూ 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించగా.. తిమ్మమ్మ 1356లో సతీసహగమనం చెందారని చెప్పారు. ఇంతటి చారిత్రక విశిష్టతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కనీస సదుపాయాలు లేక పర్యాటకులు ఎంతో ఇబ్బందిపడుతున్నారని, పర్యాటక శాఖ ఈ విషయంపై దృష్టి పెట్టి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. జాతీయ స్మారక చిహ్నంగా గుర్తిస్తే అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం సాధ్యపడుతుందని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement