Sunday, May 5, 2024

శ్రీశైలం డ్యామ్​లో డెడ్‌ స్టోరేజ్​.. హంద్రీనీవాకు వాటర్​ బంద్​..

రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే హంద్రీనీవా ప్రాజెక్టుకు నీటి విడుదల నిలిచిపోయింది. ఇందుకు కారణం శ్రీశైల ప్రధాన ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకోవడమే. శ్రీశైల బ్యాక్‌ వాటర్‌ను మల్యాల ద్వారా మళ్లించి వాటిని సీమ జిల్లాలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలోని దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. అయితే శ్రీశైల జలాశయంలో నీటి నిల్వలు పడిపోవడంతో హంద్రీనీవాకు నీటిని నిలిపివేయక తప్పలేదు. సాధారణంగా శ్రీశైల జలాశయంలో 835 అడుగులలో నీరు ఉండాలి. ఇక ముచ్చుమర్రి ఎత్తిపోతల పధకం ద్వారా హంద్రీనీవాకు నీరివ్వాలంటే జలాశయంలో 813 అడుగుల వరకు నీరు ఉండాలి. కానీ ప్రస్తుతం శ్రీశైల జలాశయంలో 807 అడుగులకు దిగజారింది. ప్రస్తుతం డ్యామ్‌లో 32 టీఎంసీల నీరు ఉంది. దీంతో మల్యాల నుంచి హంద్రీనీవాకు నీటిని నిలిచిపోక తప్పలేదు. వాస్తవంగా ఈ ఏడాది నీటి ఇయర్‌లో వర్షాలు సమృద్ధిగా కురిసి శ్రీశైలం ప్రాజెక్టుకు ఆశించిన స్ధాయిలో నీరు చేరుకుంది, అయితే ఆ నీటిని తగు రీతిలో ఏపి, అటు తెలంగాణ వినియోగించకపోగా, ఇరు రాష్టాలు విద్యుత్‌ ఉత్పాదన పేరుతో జలాశయంలో ఉన్న నీటిని విరివిగా వినియోగించడం హంద్రీనీవా ప్రాజెక్టుకు శాపంగా మారింది.

వాస్తవంగా హంద్రీనీవా ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లాలో 80వేల ఎకరాలకు సాగునీరు ఇవాల్సి ఉండగా, ఇక అనంతపురం జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించాలి. ఇందుకోసం దాదాపు 42 టిఎంసిల నీటిని ఇస్తారని అందరు బావించారు. అయితే ఈ ఏడాది హంద్రీ నీవా ప్రాజెక్టు కింద కేవలం 25.56 టిఎంసిల నీరు మాత్రమే లభ్యమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 17 టిఎంసిల నీటి కోత ఏర్పడింది. ఫలితంగా హంద్రీనీవా ప్రాజెక్టుపై ఆశలుపెట్టుకొని రబీలో పంటలు సాగుచేసిన రైతులు ప్రస్తుతం నీరు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

కరెంటు ఉత్పత్తితోనే కష్టాలు..

హంద్రినీవాకు ఉన్న పళంగా నీరు నిలిచిపోవడం శ్రీశైల జలాశయం డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకోవడమే. ఇందుకు కారణం ఏపి, తెలంగాణలు ఇష్టానుశారంగా విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగించడమే. వాస్తవంగా ఈ నీటి ఇయర్‌లో హంద్రీనీవా ఎత్తిపోతలను ప్రారంభించే ముందే ఏపి, తెలంగాణలు గిల్లికజ్జాలకు దిగాయి. జూన్‌లో డ్యాంకు నీరు చేరక ముందే రెండు రాష్టాలు విద్యుత్‌ ఉత్పాధనకు పోటీ పడ్డాయి. ఫలితంగా డ్యాంలో పూర్తి స్ధాయిలో నీరు చేరక ముందే నీటిని వినియోగించడంతో హంద్రీనీవాకు ప్రారంభ కష్టాలు తప్పలేదు. ఇక జూలైలో అటు తెలంగాణ, ఇటు ఏపిలో పోలీసులను కాపల పెట్టి మరి విద్యుత్‌ ఉత్పాధనకు నీరు వదలడంతో, ఏపి కూడ అదే బాటలో నడవక తప్పలేదు. దీంతో డ్యాంకు ఎగువ నుంచి నీటి ప్రవహాం ఉన్నా, అంతకు మించి నీటిని డ్యాం నుంచి దిగువకు విడుదల చేస్తూ వచ్చారు. దీంతో శ్రీశైల జలాశయంలో నీటి మట్టం త్వరగా పెరగలేదు. ఇక జూలై మూడవ వారంలో అధిక వర్షాలు కురవడం మూలంగా శ్రీశైల డ్యాం 835 అడుగులకు చేరి ంది. దీంతో జూలై 28న మల్యాల వద్ద హంద్రీనీవాకు చెందిన ఒక పంపు ద్వార 300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. ఇక ఆగస్టు నెలలో అన్ని పంపుల ద్వార హంద్రీనీవాకు నీటిని విడుదల చేస్తూ వచ్చారు. అయితే నవంబర్‌లో తిరిగి ఇరు రాష్టాలు విద్యుత్‌ ఉత్పధనను కొనసాగించడంతో నవంబర్‌లో హంద్రీనీవా ఎత్తిపోతల నీరు నిలిచిపోయింది. ఇదే నెల ఆఖరిలో తిరిగి వర్షాలు కురవడంతో డ్యాంలో భారీగా నీరు చేరుకోగా, హంద్రీనీవా ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేస్తూ వచ్చారు.

195 రోజుల పాటు నీటిపారుదల..

- Advertisement -

శ్రీశైలం ద్వారా హంద్రీనీవాకు 9 నెలల పాటు నీటిని ఎత్తిపోయాలి. గత ఏడాది ఏప్రెల్‌ 12 వరకు హంద్రీనీవాకు నీరు అందించగా, ఇక ఈ ఏడాది రెండు నెలలకు ముందుగానే నిలిచిపోవడం గమనార్హం. ఈ వాటర్‌ ఇయర్‌లో హంద్రీనీవా ద్వారా కేవలం 195 రోజుల పాటు నీటిపారుధల కొనసాగింది. వాస్తవంగా కర్నూలు, అనంతపురం జిల్లాలకు 42 టిఎంసిల నీరు అందుతుందని బావించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 25.56 టిఎంసి నీరు మాత్రమే అందింది. ఇందులో కర్నూలు జిల్లాకు 9.5 టీఎంసీలు నీరు అందగా, ఇక అనంతపురం జిల్లాకు 16 టీఎంసీలు వచ్చాయి. ఫలితంగా దాదాపు 17 టీఎంసీల కోత ఏర్పడింది. దీంతో హంద్రీనీవాపై ఆదారడిన రైతులకు కష్టాలు తప్పెలా లేవు. ముఖ్యంగా ఖరీఫ్‌ ప్రారంభంలో భారీ వర్షాలు కురవడంతో హంద్రీనీవా కింద జిల్లాలో దాదాపు 38వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ఇందుకోసం 3.50 టిఎంసిల నీటిని విడుదల చేశారు. ఇక నవం బర్‌లో కూడ అకాల వర్షాలు కురవడంతో జలాశయంలో రెండుసార్లు వరద నీరు వచ్చిచేరింది. ఈ క్రమంలో డ్యాంలో భారీగా నీటి నిల్వలు ఉండటంతో మే చివరి వరకు హంద్రీనీవాకు నీరు వస్తుందని రైతులు భావించారు. ఈ క్రమంలో డిసెంబర్‌లో రబీ పంటలను సాగుచేశారు. జిల్లాలో దాదాపు రెండు వేల ఎకరాల్లో రబీలో ఆరుతడి పంటలను సాగు చేయడం జరిగింది. పంటలు పెట్టి రెండు నెలలు కావడంతో పైర్లు పూతదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్న పళంగా నీరు బంద్‌ చేయడంతో దిక్కుతోచని పరిస్ధితిలో రైతులు పడ్డారు. అయితే తాగునీటికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు పేర్కొంటున్నారు. పందికోన, కృష్ణగిరి రిజర్వాయర్‌లలో తగు నీటి నిల్వలను చేసినట్లు హంద్రీనీవా అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement