Tuesday, May 14, 2024

Big story | నిపుణుల బృందం ప్రాథమిక అంచనా.. పోలీసు నిఘా నీడలో ప్రాజెక్టులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ కుంగడానికి కుట్ర కోణం దాగిఉండే అవకాశాలున్నాయని నీటిపారుదలశాఖ సందేహాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టు పటిష్టత పై నేషనల్‌ డ్యామ్‌ అథారిటీ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ జైన్‌ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం సంఘటన స్థలాన్ని పరిశీలించింది. అయితే ఇప్పటివరకు తీవ్రవాదులు పేల్చినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని కమిటీ స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మంగళవారం జైన్‌ అధ్యక్షతన ప్రతినిధి బృందం మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్‌ నంబర్‌ 20 నిశితంగాపరిశీలించింది. అయితే పిల్లర్‌ సుమారు 5 మీటర్ల మేరకు నీటిలో మునిగి ఉండటంతో లోపలి నుంచి మట్టి సేకరించి ల్యాబ్‌ కు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రాజెక్టు సంబంధించిన అన్ని గేట్లు తెరిచి నీటిని బయటకు పంపిస్తున్నారు. సందేహం ఉన్న పిల్లర్‌ చుట్టూ ఎలాంటి కదలికలు జరగకుండా ప్రత్యేక కంచె బిగించారు. పిల్లర్‌ భూతల మట్టం నుంచి అడుగు పైకి పేలుళ్లు ఉన్నట్లు నిపుణులు గమనించారు.

అయితే పేలుడు పదార్థంతో ప్రమాదం జరిగి ఉంటే ఇప్పటికే పిల్లర్‌ నేలమట్టమయ్యేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. పేలుడు శబ్దం ఏమేరకు ఎలాంటి శబ్దం వచ్చిందనే అంశంపై నిపుణుల బృందం పరిశోధన ప్రారంభించింది. అయితే శబ్దం భారీగా వచ్చిందని స్థానికులు నిపుణుల బృందానికి చెప్పినట్లు తెలిసింది. ప్రమాదవశాత్తు జరిగే పేలుడు శబ్దానికి అక్కడి నుంచి వచ్చిన శబ్దానికి సంబంధం లేకుండా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం తెలిసింది.

- Advertisement -

అలాగే క్లూస్‌ టీం మావోయిస్టుల ప్రమేయం ఉందా?అనే అంశంపై నిశిితంగా పరిశీలిస్తోంది. సంఘటన జరిగిన ప్రాంతంలోని మట్టిని, మూడుదశల్లో నీటిని సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు సమాచారం. 21 తేది సంఘటన జరిగినప్పుడు సుమారు 3 ఇంచుల నుంచి 6 ఇంచుల వరకు బ్లాక్‌ నం.7, పిల్లర్‌ నంబర్‌ 20 కుంగినట్లు అధికారులు అంచెనా వేయగా ప్రస్తుతం 6 నుంచి 7 పీట్ల మేరకు క్రమేణా వంతెన కుంగినట్లు సమాచారం తెలిసింది.

పిల్లర్‌ 20కి ప్రమాదం ఏర్పడగా పిల్లర్‌ 19, 21 తో పాటుగా ప్రస్తుతం 16,17,18, 22,23,24 పిల్లర్లు కొంతమేరకు కుంగినట్లు సమాచారం. కేంద్ర శలశక్తి శాఖ ఆధీనంలోని నేషనల్‌ డ్యాంసేేప్టీ అథారిటీ నిపుణుల బృందం దశలవారిగా పరిశోధనలు చేస్తోంది. ఇందులో ప్రధానంగా పిల్లర్‌ పునాదిలో మట్టి పటిష్టత, రాళ్లు,ఇసుక, సిమెంట్‌, ఇనుము వాడిన నిష్పత్తి, వంతెన బరువు మోసే పిల్లర్ల సమర్థత, ఇంజనీరింగ్‌ ప్లాన్‌ తో పాటుగా ఈ పిల్లర్‌ నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్ల వివరాలను కూడా నిపుణుల బృందంసేకరిస్తోంది.

ప్రాజెక్టు నిర్మించిన ఎల్‌ ఎన్‌ టీ ప్రతినిధులను కూడా నిపుణుల బృదం వెంటపెట్టుకుని పరిశోధన చేస్తుంది. అయితే ఇప్పటివరకు నిపుణుల బృందం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయలేదు. భూసార పరీక్షల్లోను ఎలాంటి లోపాలు లేవనే అభిప్రాయంలోకి నిపుణుల బృందం ప్రాథమిక అంచెనాకు వచ్చినట్లు సమాచారం. ప్రాజెక్టు 28. 25 లక్షల క్యూసెక్కుల నీటి నిల్వసామర్థ్యంతో నిర్మించగా అంతకు మించిన నీటినిల్వ ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం సంఘటన జరిగినప్పుడు 25 నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు, లేదా 2.5 టీఎం సీల నీరు మాత్రమే ఉందని ఇంజనీర్లు స్పష్టత ఇచ్చారు.

భారీ శబ్దంతో పిల్లర్‌ కుంగడం వెనుక కుట్ర కోణం ఉండే అవకాశాలున్నాయని సాగునీటి పారుదల శాఖ చెప్పడం తో పాటుగా ఫిిర్యాదులో కూడా పేర్కొనడంతో ప్రస్తుత ఎన్నికల వేళ ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిపుణుల బృందం పరిశోధనలు చేయడంతో పాటుగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూన్నారు. 110 మీటర్ల పొడవు, 4మీ నుంచి 6 మీ. వెడల్పు, 25 మీటర్ల ఎత్తులో 85 పిల్లర్లు ఉన్న పటిష్టమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి సంబంధించిన పరిశోధనల్లో బాంబు స్కాడ్‌, క్లూస్‌ టీం, డాగ్‌ స్వ్కాడ్‌ నివేదికలు వచ్చిన అనంతరమే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ ఇంజనీర్లు చెప్పారు.

నిషేధ ఆజ్ఞలు…అనుమతి లేనిదే ప్రవేశం లేదు

మేడిగడ్డ బ్యారేజీ పై నిషేధ ఆజ్ఞలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పై రాకపోకలను పూర్తిగా నిషేధించడంతో పాటుగా 1.6 కిలో మీటర్ల వంతెనను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 10.87 టీఎంసీల సామర్ధ్యం ఉన్న అన్నారం, 8.87 టీఎంసీల సామర్ధ్యం ఉన్న సుందిళ్ల బ్యారేజీలను పోలీసులు స్వాధీనం చేసుకుని నిఘా పెంచారు. నీటిపారుదల శాఖ ఫిర్యాదు మేరకు మహాదేవపూర్‌ పోలీసులు సంఘవిద్రోహ శక్తుల ప్రమమేయం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం,కుట్ర అంశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement