Saturday, December 7, 2024

రాజకీయాల వైపు క్రికెట్‌ క్రీడాకారుడు అంబటి అడుగు.. త్వరలో సొంత గ్రామం వెల్లలూరులో పర్యటన

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో: ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు అంబటి తిరుపతి రాయుడు (అంబటి రాయుడు) రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయబోతున్నారని, వైసీపీలో చేరబోతున్నారని వార్తలు వినిపించాయి. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని పొలిటికల్‌గా చర్చ నడిచింది. తాజాగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించారు. కొద్ది రోజులుగా ఆయన తరచు గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ వైసీపీ సర్కార్‌లో ప్రధానంగా చోటుచేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ, వారి ద్వారా పలు అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు.

తాజాగా తన సొంత నియోజకవర్గమైన గుంటూరు జిల్లా పొన్నూరులో పర్యటించారు. త్వరలో తన సొంత గ్రామమైన పొన్నూరు రూరల్‌ మండలం వెల్లలూరులో పర్యటిస్తానని వెల్లడించారు. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు బాగున్నాయని క్రికెటర్‌ అంబటి రాయుడు కితాబు ఇచ్చారు. గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అంబటి రాయుడు పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వపరంగా మంచి సపోర్ట్‌ అందుతుందని రైతులు చెబుతున్నారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించినట్లు వెల్లడించారు. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడుతున్నాయని రైతులు చెబుతున్నారని చెప్పుకొచ్చారు.

అలాగే ప్రభుత్వ స్కూల్స్‌ కూడా చాలా బాగున్నాయని, విద్యారంగంలో ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చిందని, విద్యార్థులు భవిష్యత్తుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను క్రీడల అభివృద్ధి గురించి మాట్లాడేందుకు కలిసినట్లు వివరించారు. రాష్ట్రంలో అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని మా తాత దగ్గర నుంచి నేర్చుకున్నానని అంబటి రాయుడు స్పష్టం చేశారు. త్వరలో గ్రామ స్థాయిలో తన పర్యటన ఉంటుందని గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటించి ఇక్కడి రైతుల, ఇతరుల సమస్యలను స్వయంగా చూసి వారితో మాట్లాడి, వాటికి ఎలాంటి పరిష్కారాలు అవసరమే తెలుసుకోని సీఎం జగన్‌కి వివరించి నాకు చేతనైనా సాయం రైతులకు, చేతివృత్తుల వారికి చేస్తానని అంబటి రాయుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement