Sunday, May 5, 2024

సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపితేనే పాక్‌తో క్రికెట్‌ సంబంధాలు.. విదేశాంగ మంత్రి జైశంకర్‌

సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించేవరకు పాకిస్తాన్‌తో భారత్‌ ఎలాంటి క్రికెట్‌ సంబంధాలు ఉండబోవని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌పై భారత్‌, పాక్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తున్న వేళ… విదేశాంగ మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ”సీమాంతర ఉగ్రవాదమనేది సాధారణ విషయం కాదు, పొరుగుదేశాలపైనే ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే ఘటనలు ప్రపంచంలో మరెక్కడా లేదు. పొరుగుదేశం ఉగ్రవాదానికి బహిరంగంగా సహాయం అందిస్తోంది. ఇది రహస్యమేమీ కాదు… భారత్‌ వైఖరేంటో ప్రపంచ దేశాలకు తెలుసు… ఉగ్రవాదాన్ని ఓ దేశం ప్రోత్సహిస్తుంటే దాన్ని మనం అంగీకరించకూడదు.

మేం దీనిపై చర్యలు తీసుకోకపోతే… ఇది అలాగే కొనసాగుతుంది. కాబట్టి పాక్‌పై ప్రపంచ ఒత్తిడి ఉండాలి. ఉగ్రదాడుల బాధితులు తమ స్వరం వినిపించకపోతే పాక్‌పై ఒత్తిడి రాదు. ఆ దేశంపై ఒత్తిడి తీసుకువచ్చే విషయంలో మేం నాయకత్వం వహిస్తాం. ఎందుకంటే ఉగ్రవాదం వల్ల మనం ఎంతగానో నష్టపోయాం” అని జైశంకర్‌ అన్నారు. విదేశాంగ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగనున్న ఆసియాకప్‌ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ పాల్గొంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement