Wednesday, May 1, 2024

దేశ వ్యాప్తంగా మ‌ళ్లీ 25 వేలు దాటిన కొత్త క‌రోనా కేసుల సంఖ్య..

దేశంలో కొత్త క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. కొత్త కేసుల సంఖ్య మ‌ళ్లీ 25 వేలు దాటింది. ఓ వైపు వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతున్నా.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 25,320 మందికి కరోనా నిర్ధారణ అయింది. వరుసగా 2 వ రోజు 20 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… 16,637 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,59,048కు చేరింది.

గత 24 గంట‌ల సమయంలో 161 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,607  కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,89,897 మంది కోలుకున్నారు. 2,10,544 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,97,38,409 డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక తెలంగాణ కూడా క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగిపోతున్నాయి. కొత్త‌గా 228 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 152 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,161కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,515 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,653గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,993 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 795 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.  జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 46 మందికి క‌రోనా సోకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement