Sunday, April 28, 2024

విద్యార్థులకు ‘కార్పొరేట్‌’ గాలం.!

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : గ్రేటర్‌ పరిధిలో పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌, ఇంటర్‌నేషనల్‌ కళాశాలలు పదో తరగతి విద్యార్థులకు గాలం వేసే ప్రక్రియకు తెరలేపాయి. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ మహమ్మారి కారణంగా పరీక్షలకు దూరంగా ఉన్న విద్యార్థులకు అనుకూల పరిస్థితులుండటంలో ఈ నెల 23 నుంచి పది పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 28న ప్రధాన పరీక్షలు ముగియగా.. ఒకేషనల్‌ విద్యార్థులకు మాత్రం జూన్‌ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూన్‌ 25లోపు ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తును ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌ 2 నుంచి స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రారంభించనున్నారు. ఈ అంశాలతో ఎలాంటి సంబంధం లేకుండానే శ్రీచైతన్య, నారాయణ(చైనా) మాఫియాకు చెందిన సంస్థలు ముందస్తు అడ్మిషన్లకు తెరలేపాయి. ఫలితాలతో ఎలాంటి సంబంధం లేదని తమ కళాశాలల్లో చేరితే.. ఫీజుల్లో రాయితీలు ఇస్తామంటూ బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నారు ఆయా సంస్థల నిర్వాహకులు. ఇటీవల పరీక్షలకు హాజరైన వారి జాబితాను తీసుకుని, ఫోన్‌ నంబర్ల ఆధారంగా సంబంధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎరవేస్తుండటం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్‌, ప్రైవేట్‌, ఇంటర్నేషనల్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తుండటం గమనార్హం.

విపత్కర పరిస్థితుల్లోనూ విద్యా వ్యాపారం..

గత 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి సందర్భంలో పది పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కూడా ఉచితంగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ.. వారం, రెండు వారాల పాటు యూజర్‌ ఐడీలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత సగం ఫీజు చెల్లించాలని, పుస్తకాలు కొనుగోలు చేయాలని వత్తిడి చెసి.. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో తమ కళాశాలల్లో అడ్మిషన్‌ తీసుకుంటే.. ఫీజులో రాయితీ ఇస్తామని ఆఫర్లు ప్రకటించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నిండా ముంచారు. కాసుల కక్కుర్తి కోసం కొవిడ్‌ విపత్కర పరిస్థి తులను వదలని చైనా గలీజుగాళ్లు.. ఈసారి అనుకూల పరిస్థితులుండటంతో గ్రేటర్‌ వ్యాప్తంగా పది పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి.. మభ్యపెడుతుండటం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement