Sunday, April 28, 2024

సిడ‌బ్ల్యుసికి ఎన్నిక‌లా? ఎంపిక‌లా?

న్యూఢిల్లి: రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించ తలపెట్టిన ఏఐసీసీ ప్లీనరీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రాయ్‌పూర్‌ వేదికగా మూడు రోజులు ఈ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. పార్టీని పునరుత్తేజితం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న హైకమాండ్‌, ఈ సదస్సులోనూ అదే పంథా కొనసాగిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి ఎన్నికలు నిర్వహిస్తారా లేక మరోసారి అంతర్గత ప్రజాస్వామ్యం అంశంతో సభ్యులను నామినేట్‌ చేయబోతున్నారా? అనేది కీలకంగా మారింది. ఫిబ్రవరి 24న ప్లీనరీ ప్రారంభ రోజున స్టీరింగ్‌ కమిటీ ఈ సందిగ్ధతకు తెరదించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. కొద్దిమాసాల కిందట ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా మరోసారి గాంధీయేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించారు. సీనియర్‌ నేతల డిమాండ్‌ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సోనియా, రాహుల్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ ప్రతినిధుల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి1300 మంది ఏఐసీసీ ప్రతినిధులు ఉన్నారు.


వర్కింగ్‌ కమిటీకి అధ్యక్షుడితోపాటు 23 మంది ఇతర సభ్యులుండాలి. వీరిలో 12మందిని ఏఐసీసీ నియమి స్తుంది. మిగిలిన వారిని పార్టీ అధ్యక్షుడు నియమించాలి. సీడబ్ల్యూసీ సభ్యుడు మాత్రమే పార్టీ కోశాధికారి లేదా ప్ర ధాన కార్యదర్శిగా నియమించబడతారు. సీడబ్ల్యూ సీలో నామినేటెడ్‌ కేటగిరీకి సంబంధన ప్రకారం మహిళ లు, బలహీన వర్గాలు, మైనారిటీలకు బెర్తులు కేటాయిస్తారు.
ప్రస్తుతం 23 బెర్త్‌లకు దాదాపు 50 మందికిపైగా అభ్యర్థులు ఉన్నారు. సీడబ్ల్యుసీలో సోనియా, రాహుల్‌, ప్రియాంక ఎంపిక లాంఛనమే అనుకుంటే ఇక ఎన్నిక జరగాల్సిన సంఖ్య 20 మాత్రమే. సీనియర్లైన భూపేంద్ర సింగ్‌ హుడా, కమల్‌నాథ్‌, జైరాం రమేశ్‌, తారిక్‌ అన్వర్‌, అంబికా సోనీ, దిగ్విజయ్‌సింగ్‌, మీరాసింగ్‌, పవన్‌ బన్సాల్‌, సిద్ధరామయ్య, రమేష్‌ చెనితాల, ఊమెన్‌ చాందీ, మణిశంకర్‌ అయ్యర్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, సెల్జా తదితరులు ముందు వరుసలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో శశిథరూర్‌, మనీశ్‌ తివారి, ఆనంద్‌ శర్మ, పృథ్వీరాజ్‌ చౌహాన్‌ తదితర జీ23 నేతలు సీడబ్ల్యూసీ రేసులో ఉంటారు.
సీడబ్ల్యూసీ ఎన్నికలు పార్టీలో గ్రూపు రాజకీయాలకు కారణమైన సందర్భాలున్నాయి. పీవీ నర్సింహారావు, సీతారాం కేసరి ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు 1992 (తిరుపతి), 1997 (కోల్‌కతా)లో ఎన్నికలు జరిగాయి. రెండు సందర్భాల్లోనూ ఎన్నికైన సభ్యులు అర్జున్‌సింగ్‌, శరద్‌పవార్‌, అహ్మద్‌ పటేల్‌, గులాం నబీ ఆజాద్‌ శక్తివంతమైన నాయకులుగా మారారు. వీరికి చెక్‌ పెట్టేందుకు తిరుపతిలో ఎన్నికైన సీడబ్ల్యూసీ సభ్యులను రాజీనామా చేయించి, వారిని నామినేటెడ్‌ సభ్యులుగా చేయడం ద్వారా పీవీ నేర్పుగా వ్యవహరించారు. అయోధ్య కూల్చివేత, అవినీతి ఆరోణలు పార్టీలో సుదీర్ఘమైన ఆధిపత్య పోరుకు దారితీసింది.
రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. శ్రేణుల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించింది. ఈ నేపథ్యంలో ఈ ప్లీనరీ సమావేశాలు అత్యంత కీలకం కానున్నాయి. ప్రజాస్వామ్యం గురించి ఇటీవల ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చిన రాహుల్‌, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా సీడబ్యూసీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement