Sunday, April 28, 2024

26 నెలల్లో జనరంజక పాలన అందించాం: సీఎం జగన్

పంద్రాగస్టు సందర్భంగా విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం జగన్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. గడిచిన 26 నెలల్లో జనరంజక పాలన అందించామని సీఎం జగన్ చెప్పారు. రేపు అనేది ప్రతిఒక్కరికీ భరోసా ఇవ్వాలన్న జగన్… హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని జగన్ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు వ్యవసాయరంగంలో రూ.83 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో బ్రతికేందుకు సొంతిల్లు కట్టిస్తామన్నారు. మహిళలు రాజకీయంగా సాధికారత సాధించాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ల సంఖ్యను గణనీయంగా పెంచనున్నట్లు చెప్పారు. రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ తెలిపారు.

అటు 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం అసెంబ్లీ భవనంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రొటెం చైర్మన్ వి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే రాష్ట్ర శాసనసభ భవనంపై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని అప్పుడే దానికి సార్దకత చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ75 ఏళ్ళ కాలంలో దేశం అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని ఇంకా చాలా సాధించాల్సి ఉందని చెప్పారు. నేడు దేశం అనేక సవాళ్ళను ఎదురుకుంటోందని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కృషి చేయాల్సి ఉందని తెలిపారు. మన విధులు,బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. నేడు దేశ సరిహద్దుల్లో అనేక కవ్వింపు చర్యలు జరుగుతున్నాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మన సైనిక బలగాలు కృషి చేస్తున్నాయని వారికి సంఘీభావంగా ప్రతి పౌరుడు ఒక సైనికునిగా తయారు కావాలని కోరారు.

అదేవిధంగా సచివాలయం మొదటి భవనం వద్ద రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సాధనకు జాతిపిత మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ వంటివారు ఎన్నో త్యాగాలు చేశారని ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో చిట్టచివరి వ్యక్తి వరకూ అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమాల్లో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement