Saturday, May 18, 2024

ఇతర రాష్ట్రాలతో సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు.. ధాన్యం, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనందున సరిహద్దు రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమంగా తెలంగాణలోనికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీ కుమార్‌ ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమ ధాన్యం రవాణాను నిరోధించడంపై పోలీసు కమిషనర్లు, ఎస్‌పీలు, విజిలెన్స్‌ , సివిల్‌ సప్లై, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశంలోనే యాసంగి వరి ధాన్యానికి గరిష్ట మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వరి ధాన్యం వచ్చే అవకాశముందన్నారు.

తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌లతో 17 సరిహద్దు జిల్లాలున్నాయని, వీటికి 50 ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్రతోపాటు ఆరు, కర్ణాటకతో నాలుగు, ఏపీలో 5, ఛత్తీస్‌గడ్‌తో 2 జిల్లాలకు వెంటనే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లాల ఎస్‌పీలు, అడిషనల్‌ కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది 161లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నందున, నిల్వకు మిల్లుల్లో స్థలం లేకపోవడంతో అక్రమంగా మిల్లర్లు తరలించే అవ కాశం ఉందని హెచ్చరించారు. మిల్లుల్లోని ధాన్యం నిల్వలపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గతంలో కేసులు నమోదైన మిల్లర్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఇతర రాష్ట్రాలతో సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఆ వివరాలను పంపాలని అడిషనల్‌ డీజీ సంజయ్‌ కుమార్‌ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ వస్తే అది రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపే ప్రమాదముందని హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రాలతో చెక్‌పోస్టులతోపాటు చెక్‌పోస్టులు లేని ప్రాంతాల నుంచి కూడా అక్రమంగా రాష్ట్రంలోకి ధాన్యం వచ్చే అవకాశముందని, దాన్నీ అరికట్టాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ పోలీసుశాఖను కోరారు. పీడీఎస్‌ బియ్యాన్ని 9రూపాయలకు కొని కొందరు మిల్లర్లు అవే బియ్యాన్ని తిరిగి 35 రూపాయలకు అమ్ముతున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

- Advertisement -

మహారాష్ట్ర నుంచి దేశీదారు (మద్యం) అక్రమంగా తెలంగాణలోకి రవాణా అవుతున్నందున అడ్డుకునేందుకు ఎక్సైజ్‌శాఖ, పోలీసుశాఖ సంయుక్తంగా పనిచేయాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నారు. సుంకం చెల్లించని లిక్కర్‌ రవాణాను నిరోధించాలన్నారు. మీడియం, ప్రీమియర్‌ లిక్కర్‌లు ఎక్కువగా గోవా, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్నాయని వీటిని అడ్డుకోవాలన్నారు. ప్రధానంగా ట్రాన్స్‌పోర్టు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. ఈ విషయమై జిల్లాల్లో ఎస్‌పీలు, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. మహబూబాబాద్‌, భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో గుడుంబా కేసులు నమోదవుతున్నాయని, ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement