Tuesday, April 30, 2024

జాబిలమ్మకు మరింత చేరువైన చంద్రయాన్‌ -3

సూళ్లూరుపేట(శ్రీహరికోట), ప్రభన్యూస్‌: చంద్రయాన్‌ -3 చంద్రుని చుట్టూ రెండవ రౌండ్‌ను పూర్తి చేసుకుని మరింత దగ్గరైంది. చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి జాబిలమ్మ రహస్యాలను చేధించే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్‌ -3 ప్రయోగాన్ని చేపట్టింది. ఈ క్రమంలో జూలై 14వ తేదీన శ్రీహరికోట లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి ఎల్‌వీఎం3-ఎం 4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ -3ని ప్రయోగించారు.

ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ తనకు నిర్ధేశించిన భూకక్ష్యలోకి చంద్రయాన్‌ -3ని ప్రవేశపెట్టింది. అనంతరం భూమి చుట్టూ చంద్రయాన్‌ -3 తిరగడం ప్రారంభించింది. ఈ క్రమంలో జూలై 31వ తేదీ రాత్రి 12గంటలకు భూమికి దగ్గరగా 236 కిలోమీటర్లు దూరపు కక్ష 12,7609 కిలోమీటర్లు తిరిగి చివరి రౌండును పూర్తి చేసుకుంది. అనంతరం ఆగస్టు 1వతేదీ అర్ధరాత్రి 12.15గంటలకు భూ కక్ష నుంచి చంద్రుని కక్షవైపు చంద్రయాన్‌ -3 తన గమనాన్ని ప్రారంభించింది.

ఈ నెల 5వ తేదీన చంద్రునికి సమీపంలోని లూనార్‌ కక్షలోకి చంద్రయాన్‌ -3 ప్రవేశించి చంద్రుని చుట్టూ తిరుగుతుంది. చంద్రునికి 174 కిలోమీటర్ల సమీప కక్ష నుంచి 1437 కిలోమీటర్ల దూరపు కక్షలో తిరిగి రెండవ రౌండ్‌ను పూర్తి చేసింది. ఇలా మరో నాలుగు సార్లు తిరిగి చంద్రుని అతి సమీప కక్ష్యలోకి చేరుకున్న తర్వాత ల్యాండర్‌ చంద్రుని దక్షిణ ధృవంలోకి సాఫ్ట్‌ల్యాండ్‌ చేయనుంది. ఈ నెల 14వ తేదీన ఉదయం 11.30 నుంచి 12.30గంటలలోగా మూడవ రౌండ్‌ను పూర్తి చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement