Saturday, May 4, 2024

India | ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం బిల్లు.. లోక్​సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇవ్వాల (మంగళవారం) పార్లమెంట్‌లో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023ని ప్రవేశపెట్టారు. దేశ రాజధానిలో సేవల నియంత్రణపై వివాదాస్పద ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు తీసుకొచ్చారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. “ఢిల్లీకి సంబంధించి ఏదైనా చట్టాన్ని తీసుకురావడానికి రాజ్యాంగం పార్లమెంటుకు అన్ని హక్కులు ఇచ్చింది” అని అన్నారు.

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై బిజూ జనతాదళ్ (బీజేడీ) కేంద్రానికి మద్దతు ఇచ్చింది. బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ విషయంలో పార్లమెంటు ఏదైనా చట్టాన్ని రూపొందించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. వారి అభ్యంతరాలన్నీ రాజకీయాలే. కాబట్టి, బిల్లును ప్రవేశపెట్టే హక్కు మాకు ఇవ్వండి.”అన్నారు. కగా, దేశ రాజధాని అధికారుల సస్పెన్షన్‌లు, విచారణల వంటి చర్యలు కేంద్రం నియంత్రణలో ఉంటాయని బిల్లు ప్రతిపాదిస్తోంది. మణిపూర్‌లో పరిస్థితిపై లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలో గందరగోళం మధ్య ఈ మధ్యాహ్నం దీనిని ప్రవేశపెట్టారు.

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఇవ్వాల్టి (మంగళవారం) పార్లమెంట్ సమావేశాలు మణిపూర్ సమస్యతో రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించగా, విపక్ష సభ్యులు మణిపూర్ అంశంపై నినాదాలు చేయడం ప్రారంభించారు. కొద్దిసేపటికే, పార్లమెంటు ఉభయ సభలు కేవలం 15 నిమిషాలపాటు పనిచేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement