Wednesday, May 15, 2024

ఆంధ్రప్రదేశ్ కలెక్టర్లకు కేంద్ర ప్రభుత్వ డీఎస్‌డీపీ అవార్డులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ కలెక్టర్లను కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అవార్డులు వరించాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం న్యూఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ 2020-21 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, విశాఖ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత పురస్కారాలను అందుకున్నారు. నైపుణ్యాభివృద్ధి ప్రణాళికకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలకు కేంద్రం ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో డీడీయు-జీకేవై, సీడీఏపీ, ఆర్టీసీ కార్యక్రమాలను అనుసంధానం చేశామని చెప్పుకొచ్చారు. నైపుణ్యాభివృద్ధి, సంబంధిత ప్రణాళికలు, కార్యక్రమాలు, శిక్షణలో అనుసరిస్తున్న విధానాలు, పద్ధతులు, వాటి మధ్య అంతరాలకు గల కారణాలను గుర్తించి ముందుకెళ్తున్నామని వివరించారు. జిల్లాలో ఆక్వా కల్చర్, గనులు, వస్త్ర పరిశ్రమ రంగాల్లో అభివృద్ధి, ఉద్యోగ కల్పన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో 3,500 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వగా 2,800 మందికి ఉద్యోగాలు వచ్చాయని, వారిలో 95% వచ్చిన ఉద్యోగాలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ తమ కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రతి 2 వేల మందికి ఒక సచివాలయం ఉందని, ప్రకాశం జిల్లాలో 719 సచివాలయాలున్నాయని తెలిపారు. ఈ సచివాలయాలు నిరుద్యోగం, నైపుణ్యాల లేమికి సంబంధించిన సమాచార సేకరణ, డేటాబేస్ తయారీకి తోడ్పడి గ్రామీణాభివృద్ధి, గ్రామాలలో మార్పునకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా యువతను గ్రామీణ, నగర ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడమే తమ లక్ష్యమని కలెక్టర్ వెల్లడించారు. తమ కార్యక్రమాలకు చేయుతనందించిన జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement