Friday, November 1, 2024

నిర్మ‌లా సీతారామన్ చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలే : మంత్రి హరీశ్ రావు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి కృషి చేస్తుంటే కేంద్రం అడ్డుప‌డుతుంద‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. మెడికల్‌ కాలేజీల విషయంలో తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంద‌న్నారు. దీనిపై కేంద్రాన్ని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్‌ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పడంపై మంత్రి హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయా జిల్లాల‌కు మెడిక‌ల్ కాలేజీలు ఇవ్వ‌ని బీజేపీకి ప్ర‌జ‌లు ఎందుకు ఓటు వేయాలో ఇప్పుడు ఆలోచించాల‌న్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఉన్నదేమీ లేదని, అంతా డొల్ల అని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. పేదల మేలుకు సంబంధించిన ఒక్క అంశం కూడా కేంద్ర బడ్జెట్‌లో లేదన్నారు. పైగా కార్పోరేట్‌లకు పన్నులు తగ్గించారని విమర్శించారు. రైతుల గురించిగానీ, మహిళల గురించిగానీ, వృత్తుల గురించిగానీ, పేదల గురించిగానీ బడ్జెట్‌లో ప్రస్తావన లేదని, పేదలకు కోతలు పెట్టినారే తప్ప మేలు చేయలేదని మండిపడ్డారు. డీడీ డైలాగ్‌ పేరుతో గురువారం హైదరాబాద్‌లో దూరదర్శన్‌ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ గురించి పూర్తిగా అబద్ధాలు మాట్లాడి బురదజల్లే ప్రయత్నం చేశారని మంత్రి విమర్శించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడింది నూటికి నూరుపాళ్లు నిజమని, ఆయన ప్రతి మాట ఆధారాలతో, లెక్కలతో మాట్లాడారని వెల్లడించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ ఉంటే కేంద్రం మెడికల్‌ కాలేజీలు కేటాయించాలని మంత్రి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement