Thursday, May 9, 2024

వజ్రోత్సవ వేళ కుల‌వివక్ష, రాజస్థాన్‌లో బాలుడి హత్య.. వారం రోజుల‌పాటు నిర‌స‌న‌ల‌కు ఎంఆర్‌పీఎస్ పిలుపు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్న సమయంలో రాజస్థాన్‌లో కులవివక్షకు ఓ చిన్నారి బలైన ఘటనపై దళిత ఉద్యమ నేత, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల ఇందర్ కుమార్ మేఘ్‌వాల్ తాను చదువుతున్న పాఠశాలలో ఓ కుండలో నీటిని తీసుకుని తాగినందుకు అదే పాఠశాల ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టిన ఘటనలో 3 వారాలు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆ చిన్నారి చివరకు ఆదివారం తుదిశ్వాస విడిచాడు. దళితుడైన ఆ బాలుడిపై కులవివక్షను ప్రదర్శించిన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినప్పటికీ, ఈ ఘటన స్వతంత్ర భారత చరిత్రపై మచ్చగా మిగిలిపోతుందని మంద కృష్ణ మాదిగ అన్నారు.

దేశంలో కొన్ని వర్గాలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని, కానీ దళితులకు కనీసం మంచినీళ్లు తాగే స్వాతంత్ర్యం కూడా లేదని ఈ ఘటన రుజువు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఇందర్ కుమార్ మేఘ్‌వాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మంద కృష్ణ, అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటికీ అంటరానితనం, కులవివక్ష పోలేదని అన్నారు. ఇందర్ కుమార్ హత్యోదంతాన్ని భారత ప్రధాని తన ఏర్రకోట ప్రసంగంలో ప్రస్తావిస్తారని ఆశించానని, కానీ ఆయన ప్రస్తావించకపోవడం విచారకరమని అన్నారు.

రానున్న 25 ఏళ్ల భవిష్యత్తు కార్యక్రమాల్లో అంటరానితనాన్ని నిర్మూలించడాన్ని పేర్కొనకపోవడం బాధాకరమని అన్నారు. కులవివక్ష నిర్మూలన రాజ్యాంగం వంటి పుస్తకాలకే పరిమితమైందని, 75 ఏళ్లు గడిచినా అంటరానితనం నిర్మూలించలేకపోవడం పాలకుల వైఫల్యమేనని ధ్వజమెత్తారు. స్వాతంత్ర్య సంగ్రామంలో దళితుల పాత్ర గురించి చెప్పడానికి జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఉదంతం చాలని, ఈ దారుణానికి ఆదేశాలిచ్చిన జనరల్ డయ్యర్‌ను అతని సొంత గడ్డపైనే దళితవర్గానికి చెందిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉధంసింగ్ కాల్చిచంపారని గుర్తుచేశారు.

దేశ జనాభాలో దాదాపు 25 శాతం వరకు ఉన్న దళితుల భాగస్వామ్యం లేకుండా నాడు స్వాతంత్ర్యోద్యమం జరగలేదని, కానీ నేటికీ దళితులు స్వాతంత్ర్య ఫలాలను అనుభవించలేకపోతున్నారని మంద కృష్ణ మాదిగ అన్నారు. దళిత బాలుడు ఇందర్ కుమార్ హత్యోదంతాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని మంద కృష్ణ ప్రకటించారు. దేశంలోని ప్రతి గ్రామంలో ఇందర్ కుమార్‌కు నివాళి అర్పించడంతో పాటు కులవివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement