Thursday, April 25, 2024

ఆర్థిక, సామాజిక స్థితిగతులతో కులగణన చేపట్టాలి.. అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆర్థిక, సామాజిక స్థితిగతులతో కూడిన కులగణన చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం గం. 12.00కు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆయన, కులాలవారీ జనాభా లెక్కల సేకరణతో పాటు పలు ఇతర అంశాలను ప్రస్తావించారు. వాటిపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరపాలని, అర్థవంతమైన చర్చలకు ఆస్కారం కల్పిస్తూ పార్లమెంట్ సమావేశాల పనిదినాలను పెంచాలని కేంద్రాన్ని కోరారు. 2022లో పార్లమెంటు కేవలం 56 రోజులు మాత్రమే (బడ్జెట్ సమావేశాలు 27 రోజులు; వర్షాకాల సమావేశాలు 16 రోజులు; శీతాకాలం సమావేశాలు 13 రోజులు) నడిచిందని తెలిపారు. 1950లలో ఏడాదికి సగటున సమావేశాల పనిదినాల సంఖ్య 120 రోజులు ఉండగా.. ఇప్పుడు సగటున 60 రోజులకు తగ్గిందని చెప్పారు.

ఇతర ప్రజాస్వామ్య దేశాల చట్టసభల సగటుతో పోల్చితే మన పార్లమెంట్ సగటు చాలా తక్కువగా ఉందని, అమెరికాలో కాంగ్రెస్ ఏడాదికి 160 రోజులు, బ్రిటిష్ పార్లమెంట్ సుమారు 150 రోజులు సమావేశాలు జరుపుతుందని ఉదహరించారు. 2022లో నేషనల్ కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారమైతే ఏడాదికి కనీసం 100 రోజులు రాజ్యసభ, 120 రోజులు లోక్‌సభ నిర్వహించాలని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వర్తించేందుకు 2023లో కనీసం 100 రోజుల పార్లమెంటు సమావేశాల కోసం అన్ని పార్టీలూ కృషి చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ లేవనెత్తిన అంశాలు:

మహిళల సమస్యలు: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. మహిళల భద్రత, విద్య, ఉపాధి, పౌష్టికాహారం వంటి సమస్యలను ఈ సెషన్‌లో చర్చకు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న చిరకాల డిమాండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

రైతుల సమస్యలు: వివావాదస్పద వ్యవసాయ బిల్లులు ఒక సంవత్సరం క్రితం రద్దయ్యాయి. అయితే రైతుల అనేక డిమాండ్లు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. వాటిలో ఒకటి అన్ని పంటలకు కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత. కనీస మద్ధతు ధరకు చట్టపరమైన హామీ లేకపోవడం వల్ల రైతులు భారీ ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు. ఈ అంశంపై కూడా చర్చ జరగాలని కోరుతున్నాం.

నీలి ఆర్థిక వ్యవస్థ: భారతదేశం విస్తారమైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడానికి ఎన్నో అవకాశాలను అందిస్తోంది. మన తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ 3 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది. అలాగే రూ. 1.5 ట్రిలియన్ల జీడీపీని సృష్టిస్తోంది. భారతదేశం బ్లూ ఎకానమీపై ఎలా మెరుగ్గా దృష్టి పెట్టగలదనే అంశంపై చర్చ జరగాలి.

వెనుకబడిన తరగతులు (ఓబీసీలు): వెనుకబడిన తరగతులు దేశ జనాభాలో సగం ఉన్నప్పటికీ, వారి జనాభా, సామాజిక-ఆర్థిక స్థితిపై ఇంకా సమగ్రమైన సమాచారం లేదు. వారి సంక్షేమం కోసం శాస్త్రీయ విధానాలను రూపొందించడానికి జనాభా గణనలో వెనుకబడిన తరగతుల కులాల వారీగా గణన అవసరం. ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాం.

సైబర్ భద్రత: ప్రభుత్వ డేటా ప్రకారం, భారతదేశంలో సైబర్‌ దాడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. 2017లో 53,000 సైబర్ దాడులు నమోదవగా, 2021లో ఆ సంఖ్య 14 లక్షలకు చేరుకుంది. ఇటీవల ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్లపై జరిగిన సైబర్ దాడి దేశంలోని సైబర్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని బలహీనతలను బయటపెట్టింది. ఈ అంశాన్ని కూడా చర్చకు తీసుకుంటారని ఆశిస్తున్నాము.

పెండింగులోని రాష్ట్ర  సమస్యలు:

విభజన సమయంలో పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరగడం వల్ల రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబద్ధతను గౌరవించాలి. అలాగే రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో ఇచ్చిన వివిధ హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లో పొందుపర్చిన హామీలు, బాధ్యతలను కేంద్రం ఇంకా నెరవేర్చలేదు. వాటిని సత్వరమే పూర్తి చేయాలి.

విభజన తర్వాత టైర్-1 నగరాలు లేకపోవడంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం ప్రైవేట్ పెట్టుబడులు రాని కారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అవసరం ఏర్పడింది. . ప్రతి జిల్లాలో కనీసం 1 ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 12 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలి. పోలవరం సాగునీటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ. ప్రాజెక్ట్‌కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను సకాలంలో పరిష్కరించాలని, బకాయిలను వెనువెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యవయం రూ. 55,549 కోట్లు కోసం పెట్టుబడి క్లియరెన్స్‌తో పాటు తాగునీటి అవసరాల కోసం డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కింద రూ. 4,068 కోట్లు నిధులు కేంద్రం సమకూర్చాలని వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి అఖిలపక్ష సమావేశంలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement