Sunday, May 19, 2024

బుల్‌ రంకే, భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్‌ 934 పాయింట్ల లాభం

చాలా రోజుల తరువాత మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్ని రోజులు నిద్రలేవని బుల్‌.. మంగళవారం నాడు రంకె వేసింది.. కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పరుగులు పెట్టాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 934 పాయింట్లు, నిఫ్టీ 288 పాయింట్లు లాభపడింది. ఈ వారం మొదటి రెండు రోజులు సోమ, మంగళవారాల్లో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
ఉదయం మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో మరింత బలపడ్డాయి. గత వారం మొత్తం నష్టాలు చూసిన ఇన్వెస్టర్లకు మంగళవారం ఊరట లబించింది. సెన్సెక్స్‌ ఒక దశలో 1200 పాయింట్ల లాభపడి, సెన్సెక్స్‌ 52,799 పాయింట్లకు ఎగబాకింది. గత వారం అన్ని కంపెనీల షేర్లు నష్టపోయాయి. పెద్ద కంపెనీలు, సంస్థల షేర్లు సైతం 20-25 శాతం వరకు నష్ట పోయాయి. దీనింతో ఈ షేర్లు కనిష్ట ధరలో లభించడంతో కొనుగోలుదారులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపించారు. ఇలా దిగువస్థాయిలో జరిగిన భారీ కొనుగోళ్ల మూలంగానే మార్కెట్లు గరిష్టంగా లాభపడ్డాయి. అమెరికాలో ఆర్థిక మాంధ్యం వచ్చే సూచనలు కనిపించంలేదని ఆ దేశ ఆర్థిక మంత్రి జన్నెత్‌ యెలన్‌ చేసిన ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఆసియా, పసిఫిక్‌ మార్కెట్లన్నీ లాభాల్లోనే ముగిశాయి.

ఈ ప్రభావం మన దేశీయ మార్కెట్లపై కూడా పడింది. చివరకు సెన్సెక్స్‌ 934.23 పాయింట్లు లాభపడి 52,532.07 వద్ద ముగిసింది. నిఫ్టీ 288.65 పాయింట్లు లాభంతో 15638.80 పాయింట్లు వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. దీని ప్రభావం కూడా మార్కెట్లపై సానుకూలంగా పడింది. బంగారం 10 గ్రాముల ధర 82 రూపాయలు పెరిగి 50,817 రూపాయిలుగా ఉంది. వెండి కేజీ 482 రూపాయిలు పెరిగి 61,226 రూపాయిలుగా ఉంది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ 77.76 రూపాయాలైంది. అత్యధికంగా 2.5 నుంచి 6 శాతం వరకు లాభపడిన షేర్లు టైటాన్‌, హిండాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్‌ ఇండియా, ఆదాని పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, ఐచర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో ఉన్నాయి. నెస్లీ ఇండియా, అపోలో ఆసుప్పట్స్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement