Friday, May 17, 2024

Delhi | ఢిల్లీ టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు.. కన్నులపండువగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీవారి కళ్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సుబ్బారెడ్డి దంపతులు, లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్ పర్సన్ ప్రశాంతి రెడ్డి-వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు కల్యాణంలో పాల్గొన్నారు.

శ్రీనివాసుడి కల్యాణాన్ని కనులారా చూడడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. అంతకుముందు సుబ్బారెడ్డి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగశాలను ప్రారంభించారు. ఈనెల 3 నుంచి 13 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు.

జమ్మూలోని నూతన దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు మంగళవారం అక్కడికి వెళ్తున్నామని చెప్పారు. దాదాపు 35 కోట్ల రూపాయల వ్యయంతో దేవాలయం నిర్మించామని తెలిపారు. జూన్ 8న దేవాలయంలో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని వెల్లడించారు. దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement