Sunday, April 28, 2024

Trouble Maker – క‌మ‌లంలో ఈట‌ల మంట‌లు – సీనియ‌ర్లు రాజేంద్ర‌పై గ‌రం గ‌రం ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ బీజేపీలో రాజకీయాలు రోజుకో కీలక మలుపు తిరుగుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వర్సెస్‌ పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. రాజేందర్‌కు వ్యతిరేకంగా బీజేపీలోని సీనియర్లంతా ఒక్కటవుతున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో బీజేపీ సీనియర్‌ నేతలు సమావేశమయ్యారు. వీరంతా ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరినవారే కావడం గమనార్హం. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, విజయశాంతి, రవీంద్రనాయక్‌, బూర నర్సయ్యగౌడ్‌, వివేక్‌ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వరరెడ్డితోపాటు దేవయ్య, సీహెచ్‌ విఠల్‌ పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ తీరుపై వీరంతా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై సీనియర్‌ నేతలు పెదవి విరిచినట్లు సమాచారం. ఈటల తీరుపై వీరంతా సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. పదవుల కోసం ఈటల ఢిల్లిలో పైరవీలు చేస్తున్నారని సీనియర్ల సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ బలాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న ఈటల పార్టీలో అనవసర గందరగోళాన్ని సృష్టిస్తున్నారని నేతలు మండిపడ్డట్లు తెలుస్తోంది. ఈటల తీరుపై ఢిల్లికి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని తీర్మానించినట్లు సమాచారం. ఈటల కేవలం సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు మాత్రమే బీజేపీలో చేరారని, అలాంటప్పుడు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని సమావేశంలో సీనియర్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్‌లో ఉండగా ఢిల్లిd వెళ్లి లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఈటల తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌ను గద్దెదించడమే తమ లక్ష్యమని ప్రకటిస్తున్న బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణరావు… కేసీఆర్‌పై కాంగ్రెస్‌ కంటే మెరుగ్గా పోరాడుతున్న బీజేపీలో చేరాలని వారికి సమావేశం సూచించింది.

తెలంగాణ ఉద్యమంలో తామంతా కీలకంగా పనిచేశామని ఈ నేపథ్యంలో ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఇస్తే తమకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానాన్ని కోరాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమంతోపాటు ఇప్పుడు బీజేపీలో తాము కూడా కీలకంగా పనిచేస్తున్నామని అధిష్టానానికి నివేదించాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు తెలియడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చెెసినట్లు తెలిసింది.

ఈ లీకులన్నీ కేసీఆర్‌ చేయిస్తున్నవే… బీజేపీలో పైరవీలతో పదవులు రావు – మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కీలక నేతల పదవుల మార్పులు అంటూ సీఎం కేసీఆరే లేనిపోని లీకులు ఇస్తూ బీజేపీ కేడర్‌ను అయోమయంలోకి నెట్టేస్తున్నారని సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. పార్టీలో గందరగోళం సృష్టించేందుకు కేసీఆర్‌ ఈ కుట్రకు తెరలేపారని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని మారుస్తారని కేసీఆర్‌ కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధాంత ప్రాతిపదికన పనిచేస్తున్న పార్టీ అని, పైరవీలతో బీజేపీలో పదవులు రావని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్‌ దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దని కేడర్‌కు పిలుపునిచ్చారు. అసలు బీజేపీలో ప్రచార కమిటీ పదవే లేదని, తమది జాతీయ పార్టీ, ఒక విధానం ఉంటుందన్నారు. రాష్ట్ర పార్టీ నేతలతో చర్చించకుండా అధిష్టానం నిర్ణయం తీసుకోదన్నారు. హైకమాండ్‌లో చర్చ తర్వాతే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ పార్టీ అని ఏదైనా నిర్ణయం, మార్పు ముందు అనుసరించాల్సిన విధానం స్పష్టంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ లీక్స్‌పై చర్చించి కేడర్‌కు ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేందుకే ఆదివారం సమావేశమయ్యామని తెలిపారు. పార్టీ బలోపేతంపైనే చర్చించామన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోవడం ఖాయమని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement