Thursday, April 25, 2024

వైసీపీ అభ్యర్థి హిందువా? కాదా?: జీవీఎల్

తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని ముఖ్యంగా బీజేపీ తన ప్రధాన అస్త్రంగా వాడుతోంది. ఈ నేపథ్యంలో గురుమూర్తి హిందువా? కాదా? అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ కాస్ట్ 1950 ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతాలను కాకుండా అన్యమత ధర్మాలను పాటించే షెడ్యూల్ కులాల వారిని ఎస్సీలుగా పరిగణించరని అన్నారు. గురుమూర్తి గూడూరులోని చర్చికి వెళ్లి బిషప్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారని చెప్పారు. అందువల్ల రిజర్వుడు స్థానమైన తిరుపతి నుంచి పోటీ చేసే అర్హత గురుమూర్తికి లేదని అన్నారు.

గురుమూర్తి హిందూ ధర్మాన్ని పాటించరా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ఒకవేళ హిందూ ధర్మాన్ని పాటిస్తే.. వారి నాయకుడికి నచ్చదనే ఉద్దేశంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదా? అని అడిగారు. గురుమూర్తి విషయాన్ని రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దేవుడి పేరుతో కరపత్రాలను ముద్రించి వైసీపీ ప్రచారం చేస్తోందని సీఎం జగన్ దీనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. తిరుపతిలో అన్యమత ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement