Monday, December 9, 2024

లాలూ ఇంటికి నితీష్‌.. బిహార్‌ రాజకీయాల్లో సమీకరణలు మారతాయా?

ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌ ఇంటికి బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ వెళ్లడం రాజకీయ దుమారం రేపుతోంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ అధినేత నితీష్‌ విపక్ష ఆర్‌జేడీ, ఒకప్పుటి మిత్రపక్ష అధినేత ఇంటికి వెళ్లడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. లాలూ సతీమణి రబ్రీదేవి నివాసంలో శుక్రవారం వారి చిన్నకుమారుడు తేజస్వి యాదవ్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు నితీష్‌ హాజరయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు ఆయన అక్కడ గడిపారు. గత ఐదేళ్లలో ప్రతిపక్ష నేత ఇంటికి నితీష్‌ వెళ్లడం ఇదే ప్రథమం. పశుదాణా కుంభకోణానికి సంబంధించి చివరి, ఐదవ కేసులోనూ లాలూ బెయిల్‌ పొందిన నేపథ్యంలో నితీష్‌ చర్య ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్‌జేడీ-జేడీయూల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకుతగ్గట్టే లాలూ పెద్దకుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలున్నాయి. రాజకీయాల్లో ఊహాగానాలు మామూలేనని, అధికారం ఇవాళ ఉంటుంది.. రేపు ఉండకపోవచ్చు.. అప్పుడు నితీష్‌కు మేం నో ఎంట్రీ బోర్డు పెట్టాం.. ఇప్పుడు నితీష్‌ చాచాజీని ఆహానించాం.. ఆయనతో రహస్యంగా కొన్ని విషయాలు మాట్లాడా, ఇదంతా మామూలేనని తేజ్‌ ప్రతాప్‌ చేసిన వ్యాఖ్యలు కొత్త సమీకరణలకు సంకేతంగా భావిస్తున్నారు. కానీ నితీష్‌ రాకను లాలూ చిన్న కుమారుడు, ప్రతిపక్షనేత తేజసి యాదవ్‌ తేలికగా తీసుకున్నారు. ఇఫ్తార్‌ విందుకు బీజేపీ, ఎల్‌జేపీ, జేడీయూ సహా అన్ని పార్టీల నేతలను ఆహానించామని, ఇందులో పెద్ద విషయం ఏమీ లేదని తేల్చేశారు. కాగా ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాశాన్‌, బీజేపీకు చెందిన షాన్వాజ్‌ హుస్సేన్‌ కూడా ఇఫ్తార్‌ విందుకు హాజరైనప్పటికీ నితీష్‌ రావడమే సంచలనంగా మారింది. కాగా బీజేపీ ఈ విషయానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. 2020 శాసనసభ ఎన్నికల్లో 74 సీట్లతో బీజేపీ, 43 సీట్లతో జేడీయూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement