Saturday, May 4, 2024

Delhi: డీబీటీ ప్రభుత్వ అతిపెద్ద విజయం.. దళారుల నుంచి ప్రజలకు విముక్తి : వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ప్రభుత్వ సాధించిన అతిపెద్ద విజయమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఈ పథకం మధ్యదళారుల కోరల నుంచి ప్రజలకు విముక్తిని ప్రసాదించిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎంపిక చేసిన ప్రధానమంత్రి మోదీ ప్రసంగాల సంకలనం ‘సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

2019 నుంచి 2020 మే వరకు ప్రధానమంత్రి చేసిన ప్రసంగాల నుంచి 86 ప్రసంగాలను ‘సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్’ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సమస్యలను పరిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను లోతుగా అర్ధం చేసుకునేందుకు ‘సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్’ ఉపకరిస్తుందని అన్నారు. ‘సర్వే జన సుఖినో భవంతు’ అనే విశాల దృక్పథంతో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన మెచ్చుకున్నారు.

గతంలో కూడా అనేక మంచి పథకాలు అమలు జరిగాయని, మోదీ నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్ణీత కాల వ్యవధిలో, లక్ష్యాలను నిర్ణయించుకుని పథకాలు అమలు చేసున్నదని అన్నారు. నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలనిస్తున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. అపారమైన వాక్చాతుర్యం వరంగా కలిగిన ప్రధాని మోదీ దేశ ప్రజలందరితో ఒకే విధంగా మమేకం అవుతున్నారని ఆయన కొనియాడారు.

కోట్లాది బ్యాంకు ఖాతాలను తెరవడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ భావించిన సమయంలో మోదీ నాయకత్వంలో లక్ష్యం సులువుగా నెరవేరిందని వెంకయ్య నాయుడు అన్నారు. తద్వారా ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల ఖాతాకు నిధులను బదిలీ చేయడం సాధ్యపడుతోందని సూత్రీకరించారు. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే పథకాలు విజయం సాధిస్తాయని మోదీ గుర్తించి అమలు చేశారని అన్నారు. భారత్ అభియాన్‌ను ప్రధానమంత్రి జన ఆందోళన (ప్రజా ఉద్యమం)గా మలిచి అమలు చేశారని గుర్తుచేశారు. “గతంలో భారతదేశం తన వాదనను అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించేందుకు అవసరమైన స్థాయిలో లేదని చాలా కాలంగా ప్రజలు భావించారు అయితే, ప్రధాని మోడీ రాకతో భారతదేశం ఇప్పుడు బలమైన శక్తిగా మారింది. భారతదేశ వాణి ప్రస్తుతం అందరికీ వినిపిస్తుంది.” అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

- Advertisement -

ముస్లిం మహిళలకు విముక్తి కలిగించిన వ్యక్తిగా మోదీ గుర్తిండి పోతారు: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు, మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి చేస్తున్న కృషి పుస్తకంలో ప్రతి అక్షరంలో కనిపిస్తుందని అన్నారు. మరుగుదొడ్ల సౌకర్యం , మంచి నీటి సరఫరా అనే రెండు అంశాలు అత్యంత కీలక సమస్యలని, గత ప్రభుత్వాలు వీటికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రెండు సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నదని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు. ట్రిపుల్ తలాక్‌పై అంశాన్ని ప్రస్తావించిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనేక శతాబ్దాలుగా అమలు జరుగుతున్న ఈ దురాచారాన్ని రద్దు చేయడం చిన్న విషయం కాదని అన్నారు. వివాహిత ముస్లిం మహిళలు విడాకుల బెదిరింపులతో నిరంతరం జీవించాల్సి వచ్చేదని అన్నారు.

నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన అతిపెద్ద వైఫల్యంగా భావించారని అన్నారు. ముస్లిం మహిళలకు హిందూ మహిళలతో సమానమైన హక్కులు కల్పించలేక పోయానని నెహ్రూ అనేవారని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్‌ రద్దు రాజకీయ, సామాజిక పరంగా కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు. ముస్లిం మహిళలకు విముక్తి కల్పించిన నేతగా మోదీ గుర్తుండిపోతారని అన్నారు. మోదీ అధికారంలోకి రాకముందు అభివృద్ధి అనేది ప్రభుత్వ, అధికార యంత్రాంగం బాధ్యతగా ఉండేదని, అయితే, ప్రధానమంత్రి ఈ భావనకు స్వస్తి చెప్పి దేశాభివృద్ధిలో ప్రజలకు స్థానం కల్పించారని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో అన్ని ప్రక్రియలు, ఫలితాల సాధనలో ప్రతి ఒక్కరికి సమాన పాత్ర కల్పించారని అన్నారు. 

మోదీ ఆలోచనలకు పుస్తకం అద్దం పడుతుంది:  అనురాగ్ సింగ్ రాకూర్

సంక్లిష్టమైన జాతీయ సమస్యలపై మోదీ ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు ప్రసంగాల ద్వారా తెలుస్తుందని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. మోదీ ఆలోచించి అమలు చేస్తున్న విధానాల వల్ల ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచిందని ఆయన అన్నారు. మధ్యవర్తుల బెడద లేకుండా, అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చేస్తున్న కృషిని గుర్తించిన ప్రజలు మోదీపై అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తున్నారని ఠాకూర్ అన్నారు.

అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో మమేకమవ్వడంలో నరేంద్ర మోదీ అసాధారణ సామర్థ్యం కలిగి ఉన్నారని ఠాకూర్ ప్రశంసించారు. విద్యార్థుల నుండి మహిళల వరకు, రైతుల నుండి సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికుల వరకు, క్రీడాకారుల నుండి వ్యాపారవేత్తల వరకు ఎవరైనా ప్రధాని ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారని ఠాకూర్ అన్నారు. వివిధ అంతర్జాతీయ సర్వేలు పిఎం మోడీని ప్రపంచంలో అత్యంత ఇష్టమైన ప్రధానమంత్రిగా గుర్తించాయని పేర్కొన్నారు . నరేంద్ర మోడీ అంటే ఏమిటో ప్రపంచానికి చెందిన శక్తివంతమైన నాయకులు వివరంగా చెప్పారని ఠాకూర్ వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోదీ విదేశీ సంబంధాలపై చేసిన ప్రసంగాలు, ఆర్థిక వ్యవస్థపై ఆయన ఆలోచనలు, కాశీ విశ్వనాథ్ ధామ్, కేదార్‌నాథ్ ధామ్, అయోధ్య, దేవఘర్ మొదలైన ప్రదేశాలలో దేశ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణపై ఆయన చేసిన పరిశీలనలు పుస్తకంలో పొందుపరిచారు. భారతదేశ పర్యావరణం మరియు హరిత భారతదేశాన్ని రూపొందించడానికి తీసుకున్న చర్యలు, వివిధ మంత్రిత్వ శాఖల విజయాలు, ఫిట్‌నెస్, యోగా మరియు క్రీడలలో ప్రధాన స్రవంతి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలు, వ్యవసాయం, వ్యవసాయ-వ్యాపారాలు, ఉపాధి, గ్రామోదయ నుంచి రాష్ట్రోదయ వరకు , స్వావలంబన దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణం వివరాలు ‘సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్’ ద్వారా తెలుస్తాయని మంత్రి అన్నారు.

రాజ్యసభ 250వ సెషన్, 8 ఆగస్టు 2019 న ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ASSOCHAM, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసిన ప్రసంగం. కోవిడ్‌కు సంబంధించి 19 మార్చి 2020న దేశానికి అందించిన సందేశం, ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా చేసిన ప్రసంగం, అయోధ్యలో రామ జన్మభూమిపై సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత దేశానికి ఆయన ఇచ్చిన సందేశం మొదలైనవాటిని ఈ సంకలనంలో పొందుపరిచారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో భారతదేశం మనుగడ సాగించదని, కాశ్మీర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఒక్కరు కూడా ఎగురవేయరని వివిధ రాజకీయ నేతలు విమర్శిస్తూ చేసిన ప్రసంగాలకు ఈ పుస్తకం ద్వారా సమాధానం లభిస్తుందని మంత్రి చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు కాశ్మీర్‌లో హర్ ఘర్ తిరంగా ప్రచారం విజయాన్ని సాధించిందని పేర్కొన్న ఠాకూర్ కాశ్మీర్ మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి సాదిస్తున్నదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement