Tuesday, April 30, 2024

Big Story : శాసిస్తున్న సోషల్‌ మీడియా!

ఒకప్పుడు కాలేజీలు అంటే అమ్మాయిలు, అబ్బాయిల అల్లర్లతో కళకళలాడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు పేరుకు కాలేజీలు, అది నడిపేది మాత్రం అపార్ట్మెంట్‌ గదుల్లో, విద్యార్థులందరూ సెల్‌ఫోన్‌లలో తమ మెదడుని దూర్చి, కనీసం బయటకు తొంగి చూడాలని ఆలోచన కూడా చేయ టం లేదు. నానాటికీ పెరిగిపోతున్న ఆధునిక సాంకేతికతలు, మానవ నిర్మిత కారకాలు , మన జీవన పరిధిని అంతకంతకు కుంచించుకు పోయేట్లు చేస్తున్నాయేమో అని అనిపిస్తోంది. ఒకప్పుడు భూమి మీద స్వేచ్ఛగా గాలి పీలుస్తూ తనకు ఇష్టం వచ్చినట్లు పరుగులు పెట్టిన మానవుడు నేడు రాతి గూళ్లను దాటి బయటకు రావట్లేదు. ఎన్నో ఏళ్లుగా అరణ్యాలలో స్వేచ్ఛగా తిరిగిన అద్భుతమైన జంతుజాలం నేడు ఆవాసాలు దొరకక తమ భూభాగం వదిలి పోవడానికి ఎంత అసౌకర్యం పొంది ఉంటాయో, అటువంటి అసౌకర్యమే నేడు మనుషులకు కూడా అనుభవం లోకి వస్తోంది. ప్రపంచంలోని అరణ్యాలను మనిషి ఆక్రమించగా మిగిలిన 31 శాతం అరణ్యాలలో నివసించే మృగాలు 68 శాతం నేడు అంతరించిపోయాయి. మిగిలిన ఆ కొద్దిపాటి అరణ్యాలలో కూడా వాణిజ్య వ్యాపార పరమైన కార్యకలాపాలు నిర్వహించడం వల్ల జంతువులు కూడా మనుషులకు దగ్గరగా ఆవాసాలు ఏర్పరుచుకుని నివసించాల్సిన దుస్థితి ఏర్పడింది. అరణ్యాలను రక్షించుకోవాలనే ఆలోచన చేయకపోగా, జంతువులకు మాత్రం కూడుగుడ్డ ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో సంస్థలు బయలుదేరుతున్నాయి.

స్థానభ్రంశం వల్ల ఇప్పుడు మనుషులే ఇబ్బందిపడాల్సి వస్తోంది. మానవ ఘర్షణల వల్ల, జాతుల ప్రక్షాళన, ప్రకృతి విపత్తుల వలన అనేకమంది నిరాశ్రయులుగా శరణార్థులుగా మారుతున్నారు. అటువంటి వారు ఇతర దేశాలలో ఆశ్రయం పొంది దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా వంటి విపత్కర సమయాలు మానవాళి జీవితాలను మరింత దుర్భరంగా మార్చడమే కాక గడప దాటి బయటకు వెళితే ఏమవుతుందో అనే భయంతో తమ జీవ నాన్ని ఇలాంటి వరకే పరిమితం చేసుకుంటున్నారు అందరు. ఇటువంటి పరిస్థితుల వల్ల ముఖ్యంగా మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్త్తోంది. అనేక దేశాలలో కరోనా వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల వల్ల 30 శాతం గృహహింస పెరిగిందంటే ఆశ్చర్యం కలుగకమానదు. కుటుంబం మొత్తం ఇంటిపట్టునే ఉండటంవల్ల మహిళలకు క్షణం కూడా తీరిక లేక, తమ ఇళ్లలో తామే పని మనుషులుగా మారిపోయి క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జీవితాలు వారివి. కళాశాలలు, పాఠశాలల స్నేహితులతో, కుటుంబ సన్నిహితులతో జరుపుకునే ప్రైవేటు కార్యక్రమాలు కూడా నేడు సామాజిక మాధ్యమాలలోకి వెళ్ళిపోయి , ఎవరో ఒకరు చెప్పినట్టు నడుచుకోవడం పరిపాటిగా మారిపోయింది. అవి కాస్త ఆనందం పంచటానికి బదులు వివాదాలకు నిలయంగా మారుతున్నాయి. మన వేషభాషలు మరొకరిని ఇబ్బంది పెట్టడం కానీ బాధించటం కానీ జరగకూడదు. ఇటువంటి వాటిని అరికట్టడానికి మనకు తగిన చట్టాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి పోస్టులు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఆ మాధ్యమాలు నడిపే వారిదే. సామాజిక మాధ్యమాల్లోని కార్యక్రమాలు కూడా ఏవో కొందరు వ్యక్తులు లేదా రాజకీయ పార్టీల కనుసన్నలలో కొనసాగడం వల్ల వీటి రూపకల్పన ఏ లక్ష్యం కోసం అయితే జరిగిందో అది వెలవెలబోతోంది.

సామాజిక మాధ్యమాలు ప్రజా వేదిక ద్వారా ప్రజా సమస్యలపై చర్చించి వాటిలోని మంచి చెడులను ప్రజల ముందుకు తీసుకు వెళ్లాల్సింది పోయి నేడు అసత్య వార్తలతో నకిలీ సమాచారంతో సమస్యలను తప్పుదారి పట్టిం చడం పరిపాటిగా మారిపోయింది. అంతర్జాల వేదికల మీద మహిళలను ఆట బొమ్మలుగా చేసి కించపరచడం నేడు అలవాటుగా మారిపోయింది. ఇది ఎక్కడి దాకా దారితీసిందంటే చివరికి అంత ర్జాలంలో మనదేశ మహిళలను వేలం పాటలు వేసే దాకా వెళ్ళింది. సామాజిక మాధ్యమాల్లో అంతర్జాలపు ఆన్‌లైన్‌ వెెబ్‌సైట్లలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని తేటతెల్లం చేస్తోంది. ఈ భూమి మీద మహిళలకు ఎటు రక్షణ లేదు, చివరికి అంతర్జాలపు ఆన్‌లైన్‌లో కూడా వారికి రక్షణ లేకపోవడం దురదృష్టకరం. మనం ఏమి తినాలి, మనము ఏం బట్టలు కట్టుకోవాలి, చివరకు మనం ఏ దేవుణ్ణి పూజించాలి, ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే విషయాలు నేడు మన చేతుల్లో లేకుండా పోతున్నాయి. అంతర్జాల యుగంలో నడుస్తున్న ఆధునిక కాలంలో కూడా కులం పేరుతో ప్రేమికులపై పరువు హత్యలు జరగటం అత్యంత దురదృష్టకరం. కొన్ని రాష్ట్రాలు మతమార్పిడులకు శిక్షలు విధించడం కూడా చూస్తుంటే మనం ఏ రాతియుగంలో ఉన్నామా అని అనిపిస్తుంది. మతోద్దారణ పేరుతో ప్రేమికులపై దాడులు చేస్తూ, కులాంతర మతాంతర వివాహాలను అడ్డుకుంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. నిజం చెప్పడానికి కూడా నేడు భయ పడాల్సి వస్తుంది. వార్తా పత్రికలు ఆన్‌లైన్‌ మీడియా సామాజిక మాధ్యమాల్లో నిజాలకు నేడు చోటు లేకుండా పోతోంది. సమాజంలోని ప్రతి ఒక్కరి ఆలోచనను ఏదో ఒక రాజకీయ సిద్ధాంతం మలిన పరుస్తూనే ఉంది.

మనకంటూ సొంత ఆలోచనలు చేయడం ఏనాడో మానేశాము. విమర్శకులను నేడు విద్రోహుల చూస్తున్నాము. దేశంలో జరుగుతున్న అనేక నేరాలు అనేక హత్యలు నేడు వెలుగులోకి రావట్లేదు అంటే ఏ మాత్రం ఆశ్చర్యం పోవాల్సిన పనిలేదు. నిర్భయ దిశ రమ్య వంటి ఒకటో రెండో ఉదంతాలు తప్ప ఈ రోజు జరిగే కొన్ని వందల ఉదంతాలు నేటికీ వెలుగులోకి రాకుండా చీకట్లోనే కలిసిపోతున్నాయి. ఎవరో ఒకరు ధైర్యం చేసి వీటిని వెలుగులోకి తీసుకు వద్దామని ప్రయత్నించినా, వాళ్లని పిచ్చి వాళ్లలా చిత్రీకరిస్తూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాయి నేటి శక్తిమంతమైన రాజకీయ వ్యాపార వర్గాలు. గుండె నిండా ఆనందించటానికి ,కడుపునిండా నవ్వడానికి కూడా నేడు చోటు లేకుండా పోతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement