Wednesday, May 1, 2024

పోడుపై సీఎం కేసీఆర్ కి భ‌ట్టి లేఖ‌..

పోడు రైతుల‌కు హ‌క్కు ప‌త్రాల‌ను ఇవ్వాల‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు బ‌హిరంగ లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం పోలంప‌ల్లి గ్రామంలో సోమ‌వారం పాద‌యాత్ర‌లో భాగంగా ఈ లేఖ‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకునేందుక మార్చి 16 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర మొద‌లు పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. 18 రోజులుగా ఆదిలాబాద్, ఆసీఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నాకు వేల మంది గిరిజనులు, ఆదివాసీలు కలిసి వారు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వివరించారు అని లేఖ‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు పట్టాల భూములను బీఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా హక్కులు కోల్పోయామని, తమ భూముల్లోకి రాకుండా అటవి అధికారులు పెడుతున్న ఇబ్బందులను చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. ఉమ్మ‌డి జిల్లాలైన ఆదిలాబాద్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, న‌ల్గ‌గొండ తదిత‌ర జిల్లాల్లో పోడు చేసుకుంటున్న రైతుల‌కు త‌క్ష‌ణ‌మే ప‌ట్టాలు పంపిణీ చేయాల‌ని డిమాండ్ చేశారు. పోడు ప‌ట్టాల‌పై 2014 నుంచి మీరు, మీ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లన్నీ నీటిమీద రాత‌లుగా మారాయ‌న్నారు. పోడు భూముల స‌మ‌స్య‌ల‌ను 2014, 2018 సాధార‌ణ‌, నాగార్జున సాగ‌ర్‌, మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పోడు భూముల స‌మ‌స్య‌ల‌ను మీరు అస్త్రంగా వాడుకుని గెలిచిన త‌రువాత మ‌రిచిపోయిన అంశాన్ని గిరిజ‌నులు గుర్తుపెట్టుకున్నారు.

నాటి మీ బీఆర్ఎస్ 2018 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో సైతం పోడు భూముల అంశాన్ని ప్ర‌స్తావించారు. 2019 మార్చిలో జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల సాక్షిగా పోడు భూములు చేసుకుంటున్న గిరిజ‌నుల‌కు హ‌క్కు ప‌త్రాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. 2019 జులై 19న అసెంబ్లీలో గిరిజ‌నుల‌కు పోడు భూముల ప‌ట్టాలు ఇచ్చేందుకు అక్క‌డే కుర్చీ వేసుకుని కూర్చుంటాన‌ని ప్ర‌క‌టించారు అన్నారు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన స‌మావేశాల్లో 11.50 ల‌క్ష‌ల ఎక‌రాక‌లు పోడు భూముల‌కు ప‌ట్టాలిస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.. అదేవిధంగా ఆర్థిక శాఖామంత్రి హ‌రీష్ రావు గ‌త నెల 9న జరిగిన మంత్రివ‌ర్గ స‌మావేశాల్లో ల‌క్ష 55 వేల 393 మందికే మొద‌టి విడ‌త‌లో హ‌క్కు ప‌త్రాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. నాలుగు ల‌క్ష‌ల మంది గిరిజ‌న‌లు హ‌క్కు ప‌త్రాల కోసం ఎదురుచూస్తుంటే 1.5 ల‌క్షల‌ మందికే ప‌ట్టాలిస్తామ‌న‌డం.. గిరిజ‌నుల‌ను నిట్టనిలువునా మోసం చేయ‌డ‌మే అని బ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. కేంద్ర అటవి హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అటవి ఫలాలపై, పోడు భూములపై గిరిజనులకు పూర్తి హక్కులున్నాయన్నారు. గిరిజనులకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరం అన్నారు. ఎన్ని లక్షల ఎకరాలపై, ఎంత మంది ధరఖాస్తు చేసుకున్నారో జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రభుత్వం జాబితాను విడుదల చేయాల‌న్నారు. పోడు భూముల సమస్యలపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాల‌న్నారు. పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాల‌న్నారు. పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయకుంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement