Thursday, May 2, 2024

బోర్డు మార్గదర్శకాలను బేఖాతర్‌.. విద్యను వ్యాపారం చేస్తున్న పలు కార్పొరేట్‌ కాలేజీలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ విద్యలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం ముందు ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్‌ విద్యలో పలు ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల ఫీజుల దోపిడీని నియంత్రించి, ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలి ఈమేరకు ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో ఇంటర్‌ విద్యలో కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తూ, ఇంటర్‌ బోర్డ్‌ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ రూ.లక్షల ఫీజు వసూళ్లతో ఇంటర్‌ విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయని పేర్కొంది. ఇంటర్‌ బోర్డ్‌ ముందు చేపట్టిన ధర్నాలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కాలేజీలపై ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని ఆరోపించారు. లోపాయకారి ఒప్పందాలతో ఇంటర్‌ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నియంత్రణ, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా కార్పొరేట్‌ సంస్థలు బహరంగ దోపిడీకీ పాల్పడుతున్నాయని, అడ్మిషన్‌ పొందిన మొదటి రోజు కళాశాల మొత్తం ఫీజులోని 60 శాతం ఫీజు వసూలు చేయడంతో పాటు పుస్తకాలు, డిపాజిట్‌ పేరిట తల్లిదండ్రులపై తీవ్ర ఫీజు భారం మోపుతున్నాయన్నారు.

ర్యాంకుల, మార్కుల పేరిట ప్రచారం చేయొద్దని ప్రభుత్వం నుండి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలు గాలికొదిలేసి తప్పుడు ప్రకటనలతో విద్యార్థులు, తల్లి దండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పేరున్న పలు కార్పొరేట్‌ ఇంటర్‌ విద్యాసంస్థలు ఒక అభూతకల్పనతో ఐఐటీ, ఎన్‌120, సూపర్‌ 60, సూపర్‌ 90, ఏఐఐఎంఎస్‌, సూపర్‌ నీట్‌ ఇలా అనేక పేర్లతో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజులు వసూలు ఫీజు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆయన తెలిపారు. కళాశాలల హాస్టల్స్‌ నిర్వహణలో దాదాపుగా అన్ని కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూనియర్‌ కాలేజీల్లో హాస్టళ్లకు అనుమతి లేకపోయినా అక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మరోవైపు అనుమతి లేని కళాశాలలు, అకాడమీల పేరిట అధికారులను తప్పు దోవ పట్టిస్తూ ఇంటర్‌ కళాశాలలు నిర్వహించడం, అనుమతి ఉండి పరిమితికి మించి అడ్మిషన్స్‌ చేపడుతున్నా కార్పొరేట్‌ కళాశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఇష్టారీతిన వ్యవహారిస్తున్నారని వెల్లడించారు.

ప్రభుత్వ కాలేజీల్లోనూ సమస్యలే….

ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలలు సమస్యలకు నిలయంగా మారాయయని, కళాశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని ప్రవీణ్‌రెడ్డి అన్నారు. కళాశాల ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికి పుస్తకాలు అందించలేదంటే ప్రభుత్వ తీరు అవగతమౌతుందన్నారు. మరోవైపు ఏళ్లుగా కళాశాలల్లో రెగ్యులర్‌ నియామకాలు లేకపోవడంతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమౌతున్నారని తెలిపారు. కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఖాళీగా ఉన్న 1750 మంది గెస్ట్‌ ఫ్యాకల్టిని నియమించకపోవడంతో కళాశాలల్లో నాణ్యమైన బోధన జరగడం లేదన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో రోజు కనీస అవసరాలకు నిధులు కేటాయించకపోవడం అత్యంత దారుణమన్నారు. ప్రభుత్వం, ఇంటర్‌ విద్యా శాఖ వెంటనే ప్రైవేట్‌ కార్పొరేట్‌ శక్తుల అఘాడాలను నియంత్రించి, ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement