Saturday, April 27, 2024

పీఆర్సీ మావల్లే… కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే!! :బండి

పీఆర్సీ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. బీజేపీ చేసిన ఆందోళనలు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం బీజేపీ వైపు నిలబడటం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పీఆర్సీ కోసం బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేసి… రక్తం చిందించి జైలు పాలు కూడా ఆయ్యారన్నారు. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాలే పునరావృతం అవుతాయని ఆందోళన చెందిన కేసీఆర్ రాత్రికి రాత్రే ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని పీఆర్సీ ఇస్తున్నట్లు చెప్పి వాళ్ల ద్వారా ప్రకటనలు చేయించుకున్నారని ఆరోపించారు బండి.

ఏది ఏమైనా బీజీపీ వత్తిడి వల్లనే సీఎం కేసీఆర్ అనివార్యంగా పీఆర్సీ ప్రకటించారనడం వాస్తవమన్నారు. కాని గతంలో ఇచ్చిన 43 శాతం కంటే ఎక్కువ ఫిట్ మెంట్ వస్తుందని ఆశించిన ఉద్యోగులందరిని ఈ ప్రకటన తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. కనీసం 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. పీఆర్సీ కమిటీ వేసిన నాటినుంచి పూర్తిగా మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చినప్పుడే ఉద్యోగ, ఉపాద్యాయవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు బండి.

పీఆర్సీ పెంపు వేతనం కేవలం 12 నెలలు మాత్రమే ఇస్తామని, అది కూడా రిటైర్ మెంట్ తర్వాత ఇస్తామనడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మోసం చేసినట్లే అవుతుందన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలన్నీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఆనాడు ఇదే విషయాన్ని చెప్పి ఓట్లేసుకుని ఈ మూడేండ్లు ఏ ఒక్కటి అమలుచేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మానసిక క్షోభకు గురిచేసింది ఈ సర్కార్ అని మండిపడ్డారు. పైగా 2018 లో చెప్పిన దాన్ని మూడేండ్ల తర్వాత అమలు చేస్తున్నామని ప్రకటించి అదేదో గొప్పగా చేశామని టీఆర్ఎస్ జబ్బలు చరుచుకోవడం వింతగా ఉందన్నారు. EHS విషయంలో కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. CGHS మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా EHS ను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. పదవీ విరమణ వయసు పెంపు సాకుతో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక పోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా కొత్తగా ఏర్పడ్డ వ్యవస్థల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement