Friday, April 26, 2024

Follow Up | లష్కరే అనుబంధ సంస్థ ‘టీఆర్‌ఎఫ్‌’పై నిషేధం.. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌

పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్‌లో హైబ్రీడ్‌ టెర్రరిజానికి పాల్పడుతున్న ‘ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌'(టీఆర్‌ఎఫ్‌)పై కేంద్రం చర్యలు చేపట్టింది. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించింది. ”లష్కరే పరోక్ష సంస్థ 2019 నుంచి కార్యకలాపాలు చేపట్టిన టీఆర్‌ఎఫ్‌ ఓ నిషేధిత ఉగ్రవాద సంస్థ. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా యువతను నియమించుకుంటోంది. ఉగ్ర కార్యకలాపాలపై ప్రచారం, నియామకాలు, పాకిస్తాన్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు, ఆయుధ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి వాటికి పాల్పడుతోంది.

జమ్మూకశ్మీర్‌ ప్రజలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా సామాజిక మాధ్యమాల వేదికగా టీఆర్‌ఎఫ్‌ ప్రభావితం చేస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని అమాయక ప్రజలు, భద్రతా దళ సభ్యుల హత్యల పథక రచనకు సంబంధించి ఇప్పటికే టీఆర్‌ఎఫ్‌ సభ్యులు, అనుబంధ వర్గాలపై భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి” అని ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. 26/11 ముంబై దాడులకు పాల్పడిన లష్కరే తోయిబాకు ప్రాక్సీగా ఈ సంస్థ పనిచేస్తోంది. తొలిసారిగా 2019లో ది రెసిస్టెంట్‌ ఫోర్స్‌ ఉగ్రవాద సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. షేక్‌ సజ్జాద్‌ గుల్‌ దీని కమాండర్‌గా పనిచేస్తున్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967ప్రకారం ఇతడిని ఉగ్రవాదిగా కేంద్ర హోం శాఖ గుర్తించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement