Tuesday, April 30, 2024

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులకు అవార్డుల పంట..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని మరో 13 ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్డ్స్ (ఎన్‌క్యూఏఎస్‌) సర్టిఫికెట్లతోపాటు మరో మూడు ఆసుపత్రులకు రీ-సర్టిఫికేషన్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు తెలిపారు. లేబర్‌ రూమ్‌, ఆపరేషన్‌ థియేటర్‌ నిర్వహణలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు నిర్మల్‌ ఏరియా ఆసుపత్రికి ‘లక్ష్య’ గుర్తింపు లభించినట్లు చెప్పారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి… వైద్య, ఆరోగ్యశాఖకు శుభాకాంక్షలు తెలిపిందని చెప్పారు. ఈ సందర్భంగా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో ప్రభుత్వ వైద్యరంగం బలోపేతమైతోందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంపట్ల హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని మరోసారి నిరూపితమైందన్నారు. రాష్ట్రంలో పీహెచ్‌సీ నుంచి ప్రజలకు నాణ్యవైన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయన్నారు.

వైద్య ఆరోగ్యరంగంలో తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెరిగాయన్నారు. విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఓపీ, ఐపీ, సర్జికల్‌ ఇలా అన్ని విభాగాల్లో వైద్య సేవల నాణ్యత పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో పీహెచ్‌సీ స్థాయి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చెస్తోందని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యరంగం దేశానికి ఆదర్శంగా మారుతోందని సంతోషం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకే పరిమితమైన జాతీయ ప్రమాణాలు గుర్తింపును తెలంగాణలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాలు సాధిస్తున్నాయని సిబ్బందిని అభినందించారు.

ప్రస్తుతం ఎన్‌క్వాష్‌మెంట్‌ సర్టిఫికెట్లు సాధించిన 13 ఆసుపత్రులను కలుపుకుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలోని మొత్తం 143 ఆసుపత్రులకు ఎన్‌క్వాష్‌ గుర్తింపు వచ్చిందని, ఈ గుర్తింపు కలిగిన ఆసుపత్రులు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ గుర్తింపు కసం ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement