Tuesday, April 30, 2024

TS | ఎన్నికల వేళ రియల్‌కు మహర్ధశ.. పెరిగిన రియల్‌ పెట్టుబడులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భారీగా పట్టుబడుతున్న నగదు భయంగానీ, ఎన్నికలకు అవసరం నిమిత్తం నేతలు అడ్డగోలుగా భూ విక్రయాలు జరుపుతారన్న రెండు అంచనాలూ తప్పాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలతో రియల్‌ ఎస్టేట్‌కు గడ్డు కాలం వస్తుందన్న ఆందోళనా వాస్తవం కాలేదు. ఎన్నికల వేళ నగదంతా రాజకీయ నేతలవద్దకే చేరి, నగదు కొరతతో రియల్‌ రంగం కొంత స్థబ్దుగా మారుతుందన్న వాదన అపోహేనని తేలిపోయింది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన తర్వాత పరిస్థితిలో పెద్దగా మార్పురాలేదు.

దీని ప్రభావంతో క్రయవిక్రయాల్లో ఎటువంటి ప్రతికూలత కనిపించడంలేదు. పైగా రోజురోజుకూ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఎన్నికల షెడ్యూల్‌ ఈ రంగంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు చూపలేదు. షెడ్యూల్‌ జారీ అయిన ఈనెల 9 తర్వాత జరిగిన క్రయవిక్రయాల్లో పెద్దగా స్ధబ్ధత లేకుండా పోయింది. ఈ నెల 11 రోజుల్లో ఏకంగా రూ. 202.71 కోట్ల రాబడి ఖజానాకు చేరింది. ఈ నెలలో ఇప్పటివరకు 50256 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 6306 డాక్యుమెంట్ల రిజిస్టర్‌ అయ్యాయి. ఈ ఒక్క రోజునే దాదాపు రూ. 37.88కోట్ల రాబడి సమకూరింది.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6లక్షల 89వేల 264 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో రూ. 6643.33 కోట్ల రాబడి నమోదైంది. ఆరున్నర నెలల్లో దాదాపు 40శాతం లక్ష్యాన్ని చేరడంతోపాటుగా, ఈ నెలలో రోజుకు రూ. 37కోట్ల రాబడి ఖజానాకు చేరుతోంది. ఎన్నికల రోజులంతా రియల్‌ పెట్టుబడులు తగ్గుతాయని భావించినా అదేమంత వాస్తవం కావడంలేదు. ఓపెన్‌ ప్లాట్లు మొదలుకుని వ్యవసాయ భూములు, ఇండ్ల కొనుగోలుకు ఇదే తరుణమని, ఈ రంగంలో పెట్టుబడులకు ఇంకుమించిన మంచి తరుణం దొరకదని సాధారణ ప్రజలు, వ్యాపారులు భావిస్తున్నారు.

- Advertisement -

ఇక వ్యవసాయ భూముల విక్రయాల్లో కూడా పెద్ద ఎత్తున పురోగతి కనిపిస్తోంది. అన్ని పార్టీలూ రైతుబంధును మరింత పెంచుతామని హామీలనివ్వడంతో వ్యవసాయ భూములకు డిమాండ్‌ పెరుగుతోంది. తద్వారా పెట్టుబడులు పోటెత్తి ఈ రంగంలో భారీగా క్రయవిక్రయాలు నమోదవుతున్నాయి. రాష్ట్ర ఆర్ధిక ప్రగతి గడచిన ఆర్ధిక యేడాదిలో భారీగా పుంజుకుంది. ఆశించిన స్థాయిని మించి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అద్భుత వృద్ధిరేటుతో ముందుకు సాగుతోంది.

నిర్ధేశిత లక్ష్యసాధనను అధిగమించి గతేడాది భారీ రాబడిని నమోదు చేసుకుని రికార్డు సృష్టించింది. నాలుగేళ్లయిన తర్వాత కూడా కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రభావం ఇంకా తగ్గలేదు. కొత్తగా వీటి ఏర్పాటుతో గడిచిన మూడునాలుగేళ్లుగా రియల్‌ రంగంలో బూమ్‌ వచ్చింది. దీంతో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ధీటుగా అన్ని జిల్లాల్లో భూములకు దశ తిరిగింది. నూతన ఐటీ పాలసీ, ఐటీఐఆర్‌, ఫార్మాహబ్‌, ఇతర పరిశ్రమల ఏర్పాటు ముమ్మరం కావడంతో రాష్ట్రంలో రియల్‌ రంగంతోపాటు, స్థిరాస్తుల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి.

రియల్‌ ఊపు…

తెలంగాణలో రియల్‌ వ్యాపార నిర్వహణకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి పెట్టుబడులు తరలి వస్తున్నాయని ఆర్ధిక శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లోనైతే క్రయవిక్రయాలకు యమా క్రేజ్‌ ఉంది. యాదగిరిగుట్ట, వరంగల్‌ జాతీnయ రహదారి, గజ్వేల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో, అటు బెంగుళూరు హైవేలపై రియల్‌ వ్యాపారం ఊపందుకుంది. నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లకు ఫుడ్‌ పార్క్‌ ప్రకటనతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement