Sunday, April 28, 2024

APSRTC | దసరాకు 5,500 స్పెషల్‌ బస్సులు.. ముందస్తు రిజర్వేషన్‌కు అవకాశం

అమరావతి, ఆంధ్రప్రభ:దసరాకు ఆర్టీసీ సమాయత్తమైంది. ప్రత్యేక సర్వీసుల నిర్వహణకు సిద్ధమైంది. దసరా వేడుకలను దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 5,500 ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. ఈ నెల 13 నుంచి 26 వరకు సాధారణ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు.

పండుగ ముందు 13 నుంచి 23 వరకు 2,700 బస్సులు, పండుగ తర్వాత 23 నుంచి 26 వరకు 2,800 ప్రత్యేక బస్సులు నడుపుతారు. మరో వైపు విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి వేడుకలకు అవసరమైన బస్సులను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్పెషల్‌ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు.

- Advertisement -

దసరా వేడుకలు..

రాష్ట్రంలోని నలుమూలలతో పాటు తెలంగాణ, హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తారు. ముఖ్యంగా ఈ నెల 22 దుర్గాష్టమి, 23 నవమి/దశమి రోజుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విజయవాడ నుంచి తిరిగే అన్ని సర్వీసులను యధావిధిగా నడుపుతారు.

జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, నగరాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందిలేని రీతిలో అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని దసరా ముందు, తర్వాత రోజుల్లో నిర్థేశిత సంఖ్యలో ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

అన్ని ప్రాంతాలకు..

సాధారణ రోజుల్లో ఆర్టీసీ నడిపే సర్వీసులతో పాటు పండుగ రోజుల్లో అదనపు సర్వీసులు నడుపుతున్నారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు కూడా అదనంగా ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.

ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, బెంగుళురు, చెన్నై, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, భద్రాచలం, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరు ప్రాంతాలకు ఐదున్నర వేల ప్రత్యేక బస్సులు నడుపుతారు.

ఎక్కడెక్కడి నుంచి..

హైదరాబాద్‌ నుంచి 2,050, బెంగుళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సులు ఏపీలోని వివిధ పట్టణాలకు నడుపుతారు. విశాఖపట్టణం నుంచి 480, రాజమండ్రి నుంచి 355, విజయవాడ నుంచి 885, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు, పల్లెలకు, నగరాలకు మరో 1,137 ప్రత్యేక బస్సులు నడుపుతారు.

సాధారణ ఛార్జీలే..

పండుగ రోజుల్లో ప్రయాణికులపై భారం పడకూడదని గత రెండేళ్లుగా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది కూడా ఇదే విధంగా నడిపేందుకు నిర్వహించి ప్రయాణికులకు ఆర్థిక వెసులుబాటు కలిపించారు.

బస్సులు..అధికారులు సిద్ధం..

నవరాత్రుల్లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున భవానీలు తరలి వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని
అందుకు అనుగుణంగా బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులతో ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ జిల్లాల నుంచి విజయవాడకు 885 బస్సులు పడపడం ద్వారా ప్రయాణికులకు రవాణా సేవలు అందించేందుకు ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని సిద్ధం చేశారు.

చిల్లర సమస్యలకు చెక్‌..

ఆర్టీసీలో చిల్లర సమస్యలకు చెక్‌ పెట్టేందుకు అధికారులు యూటీఎస్‌ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్‌ పే, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల స్వైపింగ్‌ ద్వారా ప్రయాణ టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు కలిపించారు.

ముందుగానే సీట్ల వివరాలు తనిఖీ చేసుకొని బస్సులను ఎంచుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ప్రయాణికులకు అసౌకర్యం, ఇబ్బంది లేని రీతిలో సేవల కోసం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ముందస్తు రిజర్వేషన్లు..

ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు అధికారులు అవకాశం కలిపించారు. రాను, పోను ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకునే ప్రయాణికులకు ఛార్జీలో 10శాతం రాయితీ కలిపించారు. ఏటీబీ ఏజెంట్లు, ఆర్టీసీ యాప్‌, ఆన్‌లైన్‌ విధానంలో ఈ వెసులుబాటు పొందచ్చని అధికారులు తెలిపారు.

ప్రత్యేక పర్యవేక్షణ..

రద్దీ రోజుల్లో ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సూపర్‌ వైజర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక సర్వీసుల పర్యవేక్షణ-కు జిల్లా ముఖ్య కేంద్రాలు, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అధికారులు, సూపర్‌ వైజర్లు, సెక్యూరిటీ- సిబ్బంది విధులు నిర్వహిస్తారు.

అన్ని బస్సులకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటల సమాచారం అందించేందుకు, ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కాల్‌ సెంటర్‌ 149తో పాటు 0866-2570005 ఫోన్‌ను అందుబాటులో ఉంచనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement