Monday, April 29, 2024

పొంచి ఉన్న విద్యుత్‌ సంక్షోభం.. ఎదుర్కొనేందుకు ఏపీ సిద్ధం

అమరావతి, ఆంధ్రప్రభ : దేశంలో తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడుతున్న దృష్ట్యా ఈ ఏడాది జులై-ఆగస్టు మధ్య మరోసారి విద్యుత్‌ సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నందున పటిష్టమైన ప్రణాళికను అమలు చేసి సమస్యలను అధిగమించాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన విద్యుత్తు సంస్థల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్‌ కొరత ఏర్పడిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను అమలు చేసి, ప్రతి రోజు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ ను నిరంతరాయంగా అందించేందుకు ఇప్పటి నుంచే అన్ని మార్గాలను అన్వేషించాలన్నారు. రాష్ట్రంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తికి ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ ఎనర్జీ స్థాపన సామర్థ్యాన్ని వేగవంతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. గ్రీన్‌ ఎనర్జీ విద్యుత్‌ రంగాన్ని పర్యావరణ అనుకూలమైనదిగా మార్చడంలో సహాయపడుతుందన్నారు. ఏపీ జెన్‌కో తో పాటు ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌) 31 లక్షల టన్నుల బొగ్గు దిగుమతికి ముందస్తు చర్యలు చేపట్టి టెండర్లు జారీ చేసిందని మంత్రి తెలిపారు. నైరుతి రుతుపవనాల రాకతో దేశంలో బొగ్గు తవ్వకాలు, రవాణాకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వల పెంపుపై అనిశ్చితి నెలకొంది. ఆగస్టులో దేశంలో గరిష్టంగా 214 గిగా వాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండే అవకాశం ఉందని సెంట్రల్‌ ఎలక్ట్రిస్రిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సీఈఏ) నివేదిక ఇచ్చింది. రుతుపవనాలకు ముందు తగినంత బొగ్గు నిల్వలను పెంచడంలో థర్మల్‌ స్టేషన్లు విఫలమైతే ఈ ఏడాది జూలై-ఆగస్టులో దేశం విద్యుత్‌ కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా సీఈఏ హెచ్చరించింది.

7 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కు ఒప్పందాలు..

రాష్ట్ర అవసరాల రీత్యా 7 వేల మెగావాట్ల సోలార్‌ ఉత్పాదక విద్యుత్‌ కొనుగోలు కోసం సోలార్‌ కార్పొరేషన్‌ అఫ్‌ ఇండియా (సెకి)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మంత్రి తెలిపారు. సెకీతో తక్కువ ధరకే కుదుర్చుకున్న ఒప్పందంతో రానున్న 25 ఏళ్ళ పాటు వ్యవసాయ విద్యుత్‌ సరఫరా కు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. ఇటీవల దావోస్‌ లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పునరుత్పాదక రంగంలో రూ 1.25 లక్షల కోట్ల పెట్టుబడులకు ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో పరస్పర అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుందన్నారు. కర్నూల్‌ జిల్లాలో 5230 మెగావాట్ల సామర్థంతో ఇంటిగ్రేటెడ్‌ రెన్యుబుల్‌ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్ట్‌ ను ఏర్పాటు చేస్తున్నాం.. 33,240 మెగావాట్ల సామర్థం తో 29 పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. ఈ ఏడాది బొగ్గు కొరత వల్ల విద్యుత్‌ సంక్షౌభవం ఏర్పడినా గృహాలకు 24 గంటల పాటు, వ్యవసాయానికి పగటి పూట విద్యుత్‌ ను నిరంతరాయంగా సరఫరా చేయగలిగామని తెలిపారు. పరిశ్రమల పై విధించిన ఆంక్షలను కూడా తొలగించినట్టు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి రానున్న విద్యుత్‌ సంక్షోభాన్ని కూడా విజయవంతంగా ఎదుర్కోవాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెలి కాన్ఫరెన్స్‌ లో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement