Thursday, April 25, 2024

AP: అలికాం-బత్తిలి రహదారి అంతా గోతులమయం..

కొత్తూరు, ప్రభ న్యూస్:శ్రీ‌కాకుళం జిల్లాలోనే అతి ప్రధానమైన ఈ అలికాం-బత్తిలి రహదారిపై గోతులు పూడ్చరా అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కొత్తూరు నుండి మెట్టూరు వరకు రహదారి పొడవునా పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ఉండడంతో వాహన చోదకులు నిత్యమూ ప్రమాదాలకు గురౌతూ ఆసుపత్రుల్లో చేరుతున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. దీనిపై ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై ఈ రహదారిపై రాకపోకలు సాగించేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారిపై మండల కేంద్రం కొత్తూరులో స్థానిక ఎస్సి బాలుర వసతి గృహం సమీపంలో సుమారు 150 మీటర్ల పొడవునా మోకాల్లోతు గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతులను తాత్కాలికంగానే ఆర్ అండ్ బి అధికారులు ఎప్పటికప్పుడూ మట్టి లెవిలింగ్ చేస్తున్నా గోతులుగానే దర్శనమిస్తున్నాయి. అలాగే అదేరోడ్డు పై పారాపురం వంక చెరువు సమీపంలో ఉన్న సందమ్మ గుడి వద్దకూడా డైవర్షన్ రోడ్డు గోతులు కూడా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

గూణభద్ర సమీపంలో వంశధార కాలువ బ్రిడ్జి వద్దకూడా ఈ రహదారిపై ఏర్పడ్డ గోతులు చెరువులా తలపిస్తుండడంతో ద్విచక్రవాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటువంటి ఈ ప్రధాన రహదారి దుస్థితిపై పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి గానీ, స్థానిక మండల ప్రజా ప్రతినిధులు గానీ, సంబంధిత ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు గానీ పట్టించుకొనే పరిస్థితి లేకపోవడంతో ఇదేం పరిపాలనరా బాబూ అంటూ ప్రయాణికులు, ద్విచక్రవాహన చోదకులు, పెద్ద వాహనదారులు మండిపడుతున్నారు.

రోడ్డు దుస్థితి ఇలా దాపురిస్తే, దీనికితోడు పుండుమీద కారం చల్లినట్లు భారీ లోడులతో ఇసుక లారీలు ఇదే రహదారిపై రాత్రీ పగలు తేడాలేకుండా రాకపోకలు సాగిస్తుండడంతో గోతులు రోజు రోజుకూ మరింత పెద్దవవుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే రెడ్డిశాంతి అలికాం-బత్తిలి రహదారిపై ఉన్న గోతులు పూడ్పించే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement