Saturday, May 4, 2024

AP | విశాఖ అభివృద్ధికి మరో అడుగు.. ఏపీ టూరిజానికి 20 ఎకరాలు

అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని అధికార వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్టణం అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కార్యాలయాలను అక్కడ ఏర్పాటు చేసేందుకు అవసరమైన మానవ వనరులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా ఏపీ టూరిజంకు శుక్రవారం 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీ టూరిజం శాఖకు ఈ భూమిని కేటాయించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన స్వామి నారాయణ్‌ గురుకుల్‌కు మరో 16 ఎకరాల భూమిని కేటాయించారు. దీంతో విశాఖలో టూరిజం మరింతగా అభివృద్ధి చెందనుంది. విశాఖ జిల్లాలోని విశాఖ పట్నం రూరల్‌ మండలం యెండాడ గ్రామంలో మూడు ఎకరాల భూమిని ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బీచ్‌ రిసార్ట్‌ ప్రాజెక్టు అభివృద్ధికోం ఈ భూమిని ఇచ్చారు. అలాగే సర్వే నెంబరు 186-1లోని మరో 5 ఎకరాలను కూడా టూరిజం శాఖకు ఉచితంగా ఇచ్చారు. మధురవాడ గ్రామంలోని మరో 10 ఎకరాలను కూడా ఉచితంగా ఇచ్చారు. భీమునిపట్నం మండలంలోని నారెళ్లవలస గ్రామంలోని 1.80 ఎకరాల భూమిని కేటాయించారు.

సీతమ్మధార మండలంలోని చినవాల్తేరు గ్రామంలోని 0.23 ఎకరాల్లో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో యాత్రి నివాస్‌ నిర్మాణానికి భూమిని కేటాయించారు. అలాగే గాజువాక మండలంలోని అగనంపూడి గ్రామంలోని 16.17 ఎకరాల భూమిని హైదరాబాద్‌కు చెందిన స్వామి నారాయణ్‌ గురుకుల్‌ ట్రస్టుకు ఉచితంగా ఇచ్చారు. ఈ భూమిలో అంతర్జాతీయ స్కూల్‌ నిర్మించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement