Saturday, May 18, 2024

Delhi | చైనా నుంచి పొంచి ఉన్న మరో ప్రమాదం.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సరిగ్గా నాలుగేళ్ల క్రితం చైనాలో ప్రారంభమైన కోవిడ్-19 తరహాలో ఇప్పుడు అదే దేశం నుంచి మరో ముప్పు పొంచి ఉంది. ఆ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న సరికొత్త రకం న్యుమోనియా, శ్వాసకోస సమస్యలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే సంసిద్ధమై ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యారోగ్య సదుపాయాలు, సామర్థ్యం, లోటుపాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

కోవిడ్-19 సమయంలో అమలు చేసిన తరహాలో సరికొత్త రకం న్యుమోనియా, శ్వాసకోస వ్యాధులపై నిఘా, నిర్వహణపరమైన మార్గదర్శకాలను రూపొంచించాలని ఆదేశించింది. ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, SARS-CoV-2 కారణాలతో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. చైనా సహా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆదివారం జారీ చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

శీతాకాలంలో సహజంగా వచ్చే ఇన్‌ఫ్లూయెంజాతో పాటు తలెత్తే శ్వాసకోస సమస్యలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ఇన్‌ఫ్లూయెంజాను ఎదుర్కోవడం కోసం అవసరమైన వైద్యారోగ్య సిబ్బంది, ఆస్పత్రి పడకలు, మందులు, వ్యాక్సిన్ల లభ్యత, మెడికల్ ఆక్సీజన్, యాంటీబయోటిక్స్, వ్యక్తిగత రక్షణ పరికరాలు, టెస్టింగ్ కిట్‌లు, రియాజెంట్‌లు, వెంటిలేటర్ల పనితీరు, ఆరోగ్య సదుపాయాలలో ఇన్‌ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను లోతుగా సమీక్షించాలని ఈ లేఖలో సూచించారు.

కోవిడ్-19 సందర్భంలో అనుసరించిన నిఘా వ్యూహం – కార్యాచరణ మార్గదర్శకాలను ఇప్పుడు అమలు చేయాలని కూడా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్రాలకు సూచించారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులను గుర్తించి ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ ద్వారా జిల్లా, రాష్ట్ర నిఘా యూనిట్లు పనిచేయాలని, ముఖ్యంగా పిల్లలు, యుక్తవయస్సులో ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిని నిశితంగా పర్యవేక్షించాలని కోరారు.

ఇలాంటివారి సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సిన పోర్టల్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్ చేయడం అవసరమని, ముఖ్యంగా మెడికల్ కాలేజీ ఆస్పత్రులు సహా ప్రజారోగ్య సంస్థలు, ఆస్పత్రుల్లో తీవ్ర శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటున్న రోగుల ముక్కు, గొంతు శాంపిళ్లను సేకరించి వాటిని రాష్ట్రాల్లో ఉన్న వైరస్ పరిశోధన, రోగనిర్ధారణ ప్రయోగశాలలకు పంపాలని ఆదేశించారు. ముందుజాగ్రత్త, చురుకైన చర్యలతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి, పౌరుల భద్రత, శ్రేయస్సును కాపాడేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించారు.

ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం చైనాలోని ఉత్తర ప్రాంతాలలో శ్వాసకోశ వ్యాధులు ఒక్కసారిగా పెరిగాయి. ప్రధానంగా ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, SARS-CoV-2 వంటి కారణాలతో శ్వాసకోస సమస్యలు అధికమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం కోవిడ్-19 ఆంక్షలను సడలించడం, అదే సమయంలో శీతాకాలంలో సహజంగా ఏర్పడే మైకోప్లాస్మా న్యుమోనియా కారణంగా శ్వాసకోశ వ్యాధులు ఉప్పెనలా విరుచుకుపడ్డాయి. చైనా నుంచి మరింత అదనపు సమాచారం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరినట్టు తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement