Sunday, May 12, 2024

సర్కారుపై గొంతెత్తితే కేసులు పెడతారా?: హైకోర్టు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కేసుల నమోదు పెరుగుతోంది. సోషల్ మీడియాతో పాటు రెగ్యులర్ మీడియాలోనూ భిన్నస్వరాలు వినేందుకు ప్రభుత్వం అస్సలు ఇష్టపడటం లేదు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ఛానళ్లు ప్రసారం కాకుండా చేయడం, సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిపై సీఐడీ కేసులు నమోదు చేయించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటివి సహించబోమని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.

సర్కారుపై గొంతెత్తితే సీఐడీ కేసు

ఏపీలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాల్ని, సీఎం జగన్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై రెండేళ్లుగా వైసీపీ సర్కార్ కేసులు నమోదు చేస్తోంది. వివిధ సందర్భాల్లో సర్కారును తప్పుబట్టారనే కారణంతో ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, మీడియా ప్రతినిధులపైనా ఇప్పటికే సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. వీటిపై హైకోర్టులో తాజాగా ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. టీవీ 5పై పెట్టిన కేసులో సంస్ధ అధినేత బీఆర్ నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం, సీఐడీ తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది.

సీఐడీ కేసుల తీరు ఇదీ
భిన్నస్వరాలపై నమోదవుతున్న కేసులపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్న స్వరాలు వినిపించే మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై సీఐడీ కేసులు నమోదు చేస్తోందని పిటిషనర్ నాయుడు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆయా సందర్భాల్లో 24 గంటల్లో ఎఫ్ఐఆర్‌ను వెబ్ సైట్ లో పెట్టాలన్న నిబంధనను కూడా తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఎఫ్ఐఆర్ కాపీల్ని 24 గంటల్లో వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేస్తున్నారో లేదో చెప్పాలని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. దీంతో వివరాలు సమర్పించేందుకు గడువు కోరారు.

జగన్ సర్కార్‌కు వార్నింగ్

- Advertisement -

ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న వారిపై సీఐడీ కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. భిన్నస్వరాలపై అణచివేతను ఎట్టి పరిస్ధితుల్లోనూ సహినంచబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నిజాయతీగా అభిప్రాయాలు వ్యక్తం చేసే వారి పక్షాన నిలవాల్సిందేనని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు తాజా వ్యాఖ్యలు రెండేళ్లుగా వ్యతిరేకులపై సీఐడీ కేసులతో విరుచుకుపడుతున్న వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ కానున్నాయి. ముఖ్యంగా రాజద్రోహం కేసుల నమోదులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు హైకోర్టు వ్యాఖ్యలు ఊరటనిచ్చాయి.

హెబియస్ కార్పస్ కేసులపైనా హైకోర్టు ఫైర్

ఏపీలో వ్యక్తుల అదృశ్యంపై దాఖలవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్లపైనా హైకోర్టు స్పందించింది. చాలా సందర్భాల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలైన తర్వాత అదుపులోకి తీసుకున్న వారిని కోర్టుల్లో హాజరుపరుస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే అదుపులోకి తీసుకున్న వారిపై నమోదైన ఎఫ్ఐఆర్ లను 24 గంటల్లో వెబ్ సైట్ లో పెడితే వారి కుటుంబ సభ్యులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హైకోర్టు సూచించింది.

సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భిన్నస్వరాలు పినిపించడాన్ని సమర్ధించిన హైకోర్టు.. వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే పోస్టులకు మాత్రం తాము వ్యతిరేకమని తెలిపింది. కొన్ని పోస్టులు దారుణంగా ఉంటున్నాయని హైకోర్టు న్యాయమూర్తులు తెలిపారు. గతంలో హైకోర్టు జడ్జిలు, వారి తీర్పులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారాన్ని న్యాయస్ధానం ఈ కేసు విచారణ సందర్భంగా గుర్తు చేసింది. ఈ కేసులో జరుగుతున్న విచారణ తమ దృష్టిలో ఉందని హైకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement