Friday, May 10, 2024

Delhi: ఆంధ్రభవన్‌‌ అందరిది, ప్రతిఒక్కరూ బ్రాండ్ అంబాసిడర్‌లే.. ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధానిలోని ఆంధ్రపదేశ్ భవన్‌కు ప్రతి ఒక్కరూ బ్రాండ్ అంబాసిడర్‌లా నిలనివాలని భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ పిలుపునిచ్చారు. సోమవారం ఏపీ భవన్‌లోని గోదావరి బ్లాక్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రవీణ్ ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ బెటాలియన్‌తో కలిసి భవన్ సిబ్బంది పరేడ్ నిర్వహించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన ఏపీ భవన్ సిబ్బందికి ప్రవీణ్ ప్రకాష్‌తో పాటు అడిషనల్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా పీఆర్సీ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫ్లాగ్ కోడ్‌కు సవరణలు చేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోటి జెండాలను పంపిణీ చేసిందని చెప్పారు. దేశప్రజలందరి చేతుల్లో ఎగురుతున్న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం మనమందరం గర్వించాల్సిన విషయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతేడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని గుర్తు చేసుకున్నారు.

లంబసింగి వద్ద నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు మ్యూజియం రెండేళ్లలో పూర్తవుతుందని, కుటుంబాలతో సహా తప్పకుండా అందరూ సందర్శించాలని సూచించారు. పంద్రాగస్టు అనేది ఆత్మ పరిశీలన చేసుకునే రోజని చెప్పుకొచ్చారు. నా పనితీరెలా ఉందని సమీక్షించుకుంటూ ప్రతి ఒక్కరూ భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన్ అందరిదీ అన్న ఆయన, భవన్ అందంగా-పరిశుభ్రంగా ఉంటే రాష్ట్రం కూడా అలాగే ఉంటుందని అందరూ అనుకుంటారని వివరించారు. వారంలో రెండు రోజులైనా భవన్ సిబ్బంది ఆంధ్ర రాష్ట్ర వేషభాషలను పాటించాలని నొక్కి చెప్పారు. ఏపీ భవన్‌లోని ఒక్కో రూమ్‌ను రాష్ట్రంలోని ఒక్కో జిల్లాను ప్రతిబింబిచేలా ఇంటీరియర్ డెకరేషన్ చేయాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు. ప్రతిఒక్కరూ ఆంధ్రప్రదేశ్ టూరిజం అంబాసిడర్‌లా నిలవాలన్నారు.

ఇటీవల తాను కృష్ణా-గోదావరి నదులు అనుసంధానమవుతున్న ప్రాంతంలో మడ అడవులను చూశానని, సుందర్‌బవన్‌కి ఆంధ్రప్రదేశ్‌లోని మడ అడవులు ఏమాత్రం తీసిపోవని విశ్వాసం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ముందుగా మనం చూసి, వాటి గురించి మీ చుట్టుపక్కల వారికి చెప్పాలని కోరారు. రాష్ట్రంలోని అద్భుతమైన ఆలయాల గురించి కూడా అందరికీ తెలియజెప్పాలన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి జరిగితే ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. పెట్టుబడులు, పారిశ్రామిక రంగానికి ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందన్న ప్రవీణ్ ప్రకాష్, ఢిల్లీలో మీకు తెలిసిన వారిని రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement